One Nation One Election: "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" విధానం దేశ ప్రయోజనాల కోసం అవసరమైన, ఆర్థిక ఖర్చులను తగ్గించే, పాలనా సామర్థ్యాన్ని పెంచే చర్యగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఒకే దేశం - ఒకే ఎన్నిక వర్క్ షాప్‌నకు పవన్ హాజరయ్యారు. అందులో కీలక వ్యాఖ్యలు చేశారు. 1951-52లో రూ. 11,000 కోట్లతో జరిగిన ఎన్నికల ఖర్చు 2019-20 నాటికి రూ. 60,000 కోట్లకు పెరిగిందని తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ విధానం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చని దేశ ప్రగతిని సాధించడంలో, పాలనపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలును సులభతరం చేస్తుందన్నారు. భారతదేశంలో 1951-52 నుండి 1967 వరకు లోక్‌సభ , రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరిగాయని, ఈ విధానం కొత్తది కాదని పవన్ స్పష్టం చేశారు. "వన్ నేషన్ - వన్ ఎలక్షన్" అమలుపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు, ఈ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా కమిటీ ఏర్పాటును సూచించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ఈ విధానానికి మద్దతు ఇచ్చారని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దానిని వ్యతిరేకిస్తున్నారని, ఇది విచారకరమని పేర్కొన్నారు. కరుణానిధి తన "నెంజికు నీధి" గ్రంథంలో ఈ విధానాన్ని సమర్థిస్తూ రాసిన విషయాన్ని వ్యతిరేకులు చదవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లును గెలిస్తే సూపర్, ఓడితే తప్పుడు అనే విధంగా ఇతర పార్టీలు రెండు రకాల వైఖరి చూపిస్తున్నాయని విమర్శించారు. ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
మనం మొత్తం ఎన్నికల ప్రక్రియలో చిక్కుకున్నామమని.. ఎప్పుడూ ఎన్నికలు వస్తూంటాయన్నారు. మనం నిజంగా అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని తెలిపారు. స్థిరత్వం, ఎన్నికల స్థిరత్వం, రాజకీయ స్థిరత్వం ఉంటే ప్రజాస్వామ్య వృద్ధి , మన దేశ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తమిళనాడుతో తన వ్యక్తిగత అనుబంధాన్ని ప్రస్తావించారు. తాను తమిళనాడులో పెరిగానని, అక్కడి అనుభవాలు తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచాయని, తిరువళ్లువర్, సిద్ధులు, ఎంజీఆర్, మరియు మురుగన్ దేవుడి భూమిగా తమిళనాడును అభివర్ణించారు. సనాతన ధర్మం పైనా పవన్ మాట్లాడారు. ఇది సనాతన ధర్మ భూమి. కానీ సనాతన ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు. అందరూ సనాతన ధర్మాన్ని విమర్శిస్తారు కానీ ఇస్లాం లేదా క్రైస్తవ మతంపై వ్యాఖ్యలు చేయరు. కానీ నిరంతరం హిందూ మతంపై దాడి చేస్తారన్నారు.