Pakistan Floods:
పొంగిపొర్లుతున్న ఇండస్ నది..
పాకిస్థాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాదాపు మూడొంతుల దేశం నీట మునిగింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో వరద తాకిడికి విలవిలాడుతోంది దాయాది దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పాకిస్థాన్ వరదలకు సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది. పాక్ ఎంత దారుణ స్థితిలో ఉంది కళ్లకు కట్టాయి ఆ ఫోటోలు. ఈ వరదల కారణంగా...ఆహారం దొరక్క ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వ్యవసాయ భూమి అంతా నీట మునిగింది. ఆహార కొరతతో పాటు అనారోగ్యమూ పాక్ ప్రజల్ని పట్టి పీడిస్తోంది. అంటు వ్యాధులు ప్రబలు తున్నాయి. సాధారణ వర్షపాతం కన్నా 10 రెట్లు ఎక్కువగా నమోదవటమే ఈ దుస్థితికి కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ భారీ వర్షపాతం కారణంగా...ఇండస్ నది పొంగిపొర్లుతోంది. కొన్ని కిలోమీటర్ల మేర ఇదో సరస్సులా మారిపోయినట్టు...యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఊహించని రీతిలో ఆహార కొరత
Action Against Hunger లెక్కల ప్రకారం...పాక్‌లో వరదలకు ముందే 2 కోట్ల 70 లక్షల మందికి సరైన ఆహారం అందటం లేదు. ఇప్పుడు వరదలు వచ్చాక...పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దాదాపు 20 లక్షల పంటభూములు నాశనమయ్యాయి. 7,94,000 మేర పాడి పశువులు చనిపోయాయి. "ప్రస్తుతానికి అక్కడి ప్రజల్ని రక్షించటం తప్ప వేరే మార్గం కనిపించటం లేదు. వరదలు అనూహ్య రీతిలో నష్టాన్ని చేకూర్చాయి. పంట పొలాలు ధ్వంసమైపోయాయి. మూగజీవాలు నీళ్లలో పడి కొట్టుకుపోతున్నాయి. ఈ సమస్యలతో పాటు ప్రజల్ని ఆకలి వేధిస్తోంది" అని యూకేకు చెందిన Disasters Emergency Committee చీఫ్ ఎగ్జిగ్యూటివ్ సలేహ్ సయ్యద్ వివరించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆగస్టు 30వ తేదీన ఓ ప్రకటన చేశారు. "వరదల కారణంగా ఆహారానికి కొరత ఏర్పడింది. నిత్యావసరాల సరుకుల ధరలు దారుణంగా పెరిగాయి. టమాటాలు, ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటాయి" అని వెల్లడించారు. తన దేశ ప్రజల్ని ఆకలితో ఉంచాలని అనుకోవటం లేదని, వారి ఆకలి తీర్చే మార్గాలు అన్వేషిస్తున్నానని స్పష్టం చేశారు. ఇవి పాక్ చరిత్రలోనే అత్యంత భారీ వరదలని...వీటి కారణంగా...దాదాపూ 10 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఆరోగ్య సంక్షోభం
మెడికల్ అసిస్టెన్స్ లేకపోవటం వల్ల పాకిస్థాన్‌లో వరదల కారణంగా...జబ్బులు తీవ్రమయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. చర్మసంబంధిత వ్యాధులు, శ్వాసకోస సమస్యలు, మలేరియా, డెంగ్యూ లాంటి సమస్యలు ఎదుర్కోక తప్పదని తెలిపింది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులతోనూ ప్రజలు ఇబ్బందులు పడతారని వెల్లడించింది. జూన్ మధ్య పోటెత్తుతున్న వరదల కారణంగా...1,100 మంది మృతి చెందారు. వారిలో 400 మంది చిన్నారులున్నారు. దాదాపు 3 కోట్ల 30 లక్షల మందిపై వరదల ప్రభావం పడిందని అధికారులు వెల్లడించారు. దాదాపు 10 లక్షల ఇళ్లు కుప్ప కూలాయి. 5 వేల కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 1961 తరవాత ఈ స్థాయిలోవరదలు రావటం మళ్లీ ఇప్పుడే.
Also Read: KCR Targets NTR? : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం
Also Read: Karnataka: భార్య కోసం ఇద్దరు భర్తల ఫైటింగ్, అసలేం జరిగిందంటే?