Pakistan Eid: 



స్వీట్‌లు కూడా కొనలేక..


ప్రపంచంలోని ముస్లింలు అంతా రంజాన్ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున ప్రార్థనలు చేశారు. బంధువులు, మిత్రులు అంతా కలిసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచి పెట్టారు. కానీ ఆ దేశంలో మాత్రం ప్రజలు పస్తులున్నారు. ఆకలిని తట్టుకోలేక నీరసించిపోయి నిద్రలోకి జారుకున్నారు. పండుగ నాడు నోరు తీపి చేసుకోడానికీ వీల్లేకుండా పోయింది. దాయాది దేశం పాకిస్థాన్‌లోని దుస్థితి ఇది. ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుని నానా అవస్థలు పడుతున్నారు అక్కడి పౌరులు. ఒక్క పూట తిండికే కష్టంగా ఉంది. అగ్గిపెట్టె నుంచి పెట్రోల్ వరకూ అన్ని ధరలూ దారుణంగా పెరిగాయి. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. వీటిని కొనే స్థోమత చాలా మంది ఆకలితోనే బతుకుతున్నారు. రేషన్ షాప్‌లు, పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. అంత ఎదురు చూసినా దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఇప్పటికే చాలా బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. రేషన్ షాపుల్లోనూ ఏమీ మిగలడం లేదు. 


రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం 


తగినంత సరుకులు లేక గంటల పాటు ఎదురు చూసి ఖాళీ సంచులతో ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు పౌరులు. ఇక గ్యాస్ సిలిండర్‌లను ప్రభుత్వమే అధికారికంగా నిలిపివేసింది. విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసి తెచ్చుకునే ఆర్థిక స్తోమత ప్రస్తుతానికి పాక్‌కి లేదు. ఫారెక్స్ నిల్వలూ దారుణంగా పడిపోయాయి. పాకిస్థాన్ మీడియా కొన్ని సంచలన విషయాలు వెల్లడించింది. పాక్ చరిత్రలోనే ఎప్పుడూ చూడనంతగా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో నమోదైనట్టు స్పష్టం చేసింది. గత మూడు నెలల్లోనే ద్రవ్యోల్బణం రేట్ 48%కి పెరిగింది. సోషల్ మీడియాలోనూ పాక్‌ దారిద్ర్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 


"మేం ఎలా రంజాన్ జరుపుకోగలం..? ఈ ప్రభుత్వంతో దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ సర్కార్ ఉన్నా లేనట్టే ఉంది. 75 ఏళ్ల రికార్డు అధిగమించి మరీ ద్రవ్యోల్బణం పెరుగుతోంది" 


- స్థానిక పౌరులు, పాకిస్థాన్


గతేడాది ఈద్ రోజున పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.150గా ఉంది. అదే లీటర్ పెట్రోల్ ధర ఈ రంజాన్‌ పండుగ నాటికి రూ.282కి పెరిగింది. డీజిల్ లీటర్ ధర రూ.293. ఇక గ్యాస్‌ విషయానికొస్తే కేజీకి రూ.300 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆహార పదార్థాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. కిలో చికెన్ ధర రూ.1000కి పైనే. నెయ్యి ధర రూ.2595 నుంచి రూ.3 వేలకు పెరిగింది. లీటర్ పాల ధర రూ.100గా ఉంది. పాకిస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఇప్పటికే ఆ దేశం పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దానికి తోడు రోజుకో సమస్య వెంటాడుతోంది. సోమవారం పాకిస్థాన్‌ వ్యాప్తంగా విద్యుత్‌ సమస్య తలెత్తింది. నేషనల్ గ్రిడ్‌లో ఏర్పడ్డ సమస్యల కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తింది. ఇప్పుడు వందల మంది ఉద్యోగాలు లేక రోడ్డున పడుతున్నారు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో పొరుగు దేశం పాకిస్థాన్ అల్లాడుతోంది. 


Also Read: World War II Ship: రెండో ప్రపంచ యుద్ధంలో మునిగిన ఓడ, ఇన్నాళ్లకు దొరికింది - వైరల్ న్యూస్