Odisha Government Corruption Crackdown:   ప్రభుత్వ సర్వీసులో జూనియర్ ఇంజనీర్‌గా చేరినప్పుడు ఆయన జీతం కేవలం  6,000 రూపాయలు . కానీ, సుమారు 25 ఏళ్ల సర్వీసు ముగిసేసరికి ఆయన కూడబెట్టిన ఆస్తులను చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులే నోరెళ్లబెట్టారు. ఒడిశాకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  భువనేశ్వర్ శబర్  అక్రమాస్తుల బాగోతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.   1999లో ఒడిశా ప్రభుత్వంలో జూనియర్ ఇంజనీర్‌గా అడుగుపెట్టిన భువనేశ్వర్ శబర్ ప్రస్థానం ఒక అద్భుతమైన ఎదుగుదలలా కనిపిస్తుంది, కానీ అది అవినీతి పునాదులపై నిర్మించిన సామ్రాజ్యం. ఈ వారం ఒడిశా విజిలెన్స్ శాఖ నిర్వహించిన దాడుల్లో ఆయనకు సంబంధించిన ఆస్తుల చిట్టా బయటపడింది. ఏకంగా  5 బహుళ అంతస్తుల భవనాలు, 97 ప్లాట్లలో విస్తరించి ఉన్న 83 ఎకరాల భూమి, 17 ఎకరాల్లో రెండు ఫామ్‌హౌస్‌లు,   ఒక భారీ మార్కెట్ కాంప్లెక్స్ చూసి అధికారులు అవాక్కయ్యారు.    

Continues below advertisement

శబర్ తన కెరీర్‌లో అత్యధిక కాలం తన సొంత జిల్లా అయిన కలహండిలోనే  విధులు నిర్వహించారు.  2007 నుండి ఆయనకు రెండుసార్లు ప్రమోషన్లు వచ్చినా, తన పలుకుబడితో బదిలీ కాకుండా అక్కడే తిష్ట వేశారు. రోడ్లు ,భవనాల విభాగంలో పనిచేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ భారీ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విజిలెన్స్ అధికారులు ఆయన నివాసాల్లో 10.72 లక్షల రూపాయల డిపాజిట్లు, నగదు, ఖరీదైన కార్లు మరియు 20 లక్షల విలువైన గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. 

Continues below advertisement

విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ ఆస్తులకు సంబంధించి శబర్ ఎటువంటి సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేకపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 2018 కింద అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆస్తుల విలువను లెక్కించే పనిలో టెక్నికల్ వింగ్ నిమగ్నమై ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి ఇంత భారీ స్థాయిలో భూములు, భవనాలు ఎలా సంపాదించాడనే కోణంలో లోతైన దర్యాప్తు సాగుతోంది.

ఒడిశా ప్రభుత్వం అవినీతిపై చేపట్టిన ఉక్కుపాదం లో భాగంగా ఈ దాడి జరిగింది. 2025లో ఒడిశా విజిలెన్స్ ఏకంగా 205 కేసులు నమోదు చేయగా, అందులో 53 మంది క్లాస్-1 అధికారులపై చర్యలు తీసుకోవడం విశేషం. అవినీతి ఎంతటి వారినైనా వదలదనే సందేశాన్ని ఈ కేసు ద్వారా ప్రభుత్వం బలంగా పంపింది. శబర్ ఉదంతం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.