47 NTA Officials Removed:   దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్   ప్రవేశ పరీక్ష పత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర విద్యాశాఖ  బిగ్ రీసెట్ ప్రణాళికను అమలు చేస్తోంది.   ఇందులో భాగంగా ఏజెన్సీలోని దాదాపు 47 మంది అధికారులను   తొలగిస్తూ  నిర్ణయం తీసుకుంది.  ఎన్టీఏ చరిత్రలోనే ఇది అతిపెద్ద పరిపాలనాపరమైన ప్రక్షాళనగా నిలవనుంది.

Continues below advertisement

ఈ చర్యలతో పాటు లీకేజీలకు మూలకారణంగా మారిన ఔట్‌సోర్సింగ్ పద్ధతులకు స్వస్తి పలకాలని ,వాటిలో మూలమట్టమైన మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఇప్పటివరకు ప్రశ్నాపత్రాల తయారీ, పంపిణీ, పరీక్షా కేంద్రాల నిర్వహణ,  డేటా ప్రాసెసింగ్‌లో ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడటమే భద్రతా లోపాలకు దారితీసిందని గుర్తించారు. ఇకపై ప్రభుత్వ పరిధిలోని సాంకేతిక వ్యవస్థలు, అంతర్గత నిపుణుల ద్వారానే పరీక్షల ప్రక్రియను నిర్వహించేలా నూతన నిబంధనలను రూపొందిస్తున్నారు.

కేవలం అధికారుల బదిలీలు, తొలగింపులకే పరిమితం కాకుండా, లీకేజీలకు లేదా నిర్లక్ష్యానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపి దోషులకు కఠిన శిక్షలు పడేలా చూడటమే కాకుండా, నూతన  యాంటీ పేపర్ లీక్  చట్టాలను పటిష్టంగా అమలు చేయనున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఏ ఒక్క అధికారి లేదా ఏజెన్సీ అక్రమాలకు పాల్పడకుండా బలమైన వ్యవస్థను నిర్మించాలనేది కేంద్ర ఆలోచన.

Continues below advertisement

సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రశ్నాపత్రాలను పూర్తిగా డిజిటలైజ్ చేయడం, ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో చివరి క్షణంలో పరీక్షా కేంద్రాలకు చేరవేయడం,   ఏఐ  ప్రాసెసింగ్ ద్వారా మోసాలను అరికట్టేలా సాంకేతిక సంస్కరణలు ప్రవేశపెడుతున్నారు. నీట్ మాత్రమే కాకుండా జేఈఈ మెయిన్స్, సీయూఈటీ వంటి 15 నుంచి 20 జాతీయ స్థాయి పరీక్షలను అత్యంత పారదర్శకంగా,  లీక్ ప్రూఫ్ వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ఈ రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు.                     

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న మనోవేదనను దృష్టిలో ఉంచుకుని, ఎన్టీఏపై కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకే ప్రధాని కార్యాలయం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ మార్పులు చేపడుతున్నారు. ఈ భారీ ప్రక్షాళన ద్వారా జాతీయ పరీక్షల విధానంలో సుదీర్ఘకాలంగా పేరుకుపోయిన లోపాలు తొలగిపోతాయని, భవిష్యత్తులో అర్హులైన విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.