Note Scandal Delhi Assembly: 


లంచం ఇచ్చారంటూ..


ఢిల్లీ అసెంబ్లీలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తనకు ఓ కాంట్రాక్టర్ లంచం ఇచ్చాడంటూ మండి పడ్డారు. ఆ నోట్ల కట్టని అసెంబ్లీలో అందరికీ చూపించారు. "బాబాసాహెబ్ అంబేడ్కర్ హాస్పిటల్‌లో నర్సింగ్‌తో సహా మరి కొన్ని డిపార్ట్‌మెంట్‌ లలో రిక్రూట్‌మెంట్‌ కోసం టెండర్ వేశారు. 80% మేర పాత ఉద్యోగులనే మళ్లీ విధుల్లో చేర్చుకోవాలని చట్టం చెబుతోంది. కానీ... అలా జరగడం లేదు. ఉద్యోగాలు ఇప్పించేందుకు ఇలా లక్షల కొద్ది రూపాయలు లంచంగా ఇస్తున్నారు" అని స్పష్టం చేశారు. ఈ లంచం తీసుకుని ఉద్యోగం సంపాదించుకున్నా...ఆ తరవాత కూడా కాంట్రాక్టర్లు వాళ్లను వేధిస్తారని అన్నారు. "ఉద్యోగం వచ్చాక కూడా వాళ్లకు పూర్తి జీతాలు అందవు. కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున వాళ్ల నుంచి డబ్బుని లాక్కుంటారు. ఇదే విషయమై వాళ్లు స్ట్రైక్ చేస్తే దారుణంగా కొట్టించారు. ఈ ఘటనపై డీసీపీ విచారణ జరిపించాలని చెప్పాను. చీఫ్‌ సెక్రటరీకి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం" అని తెలిపారు. తనకు లంచం ఇచ్చినట్టు డీసీపీకి చెప్పాని, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని డిమాండ్ చేశానని చెప్పారు గోయల్. ఇంత వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని అన్నారు. సరైన విధంగా విచారణ చేపట్టాలని అసెంబ్లీ వేదికగా కోరారు. ఇప్పటికే ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతుండగా...ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలోనే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకూ ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.