Satyendar Jain: దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌.. తిహార్ జైలులో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భాజపా, ఆమ్‌ఆద్మీ మధ్య మాటల దాడులు కూడా జరిగాయి. అయితే ఆ వీడియోలో సత్యేంద్ర జైన్‌కు మసాజ్ చేసిన వ్యక్తి ఫిజియోథెరపిస్ట్ అని ఆప్ పేర్కొంది. కానీ ఆ వ్యక్తి ఫిజియో కాదని అత్యాచార నిందితుడని జైలు అధికారులు తెలిపారు.






రేపిస్ట్


ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనకు విరుద్ధంగా వైరల్ అయిన ఆ సీసీటీవీ వీడియోలో సత్యేంద్ర జైన్‌తో ఉన్న వ్యక్తి అదే తిహార్ జైలులో ఖైదీ అని, ఫిజియోథెరపిస్ట్ కాదని అధికారులు చెప్పారు.


అత్యాచారం నిందితుడు అయిన ఆ వ్యక్తి పేరు రింకు. అతనిపై పోక్సో చట్టం & IPC 376, 506 & 509 కింద అభియోగాలు ఉన్నట్లు తిహార్ జైలు అధికారిక వర్గాలు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. 


వైరల్


మనీలాండరింగ్ కేసులో అరెస్టైన ఆప్ నేత సత్యేంద్ర జైన్‌.. తిహార్‌ జైల్లో మసాజ్ చేయించుకుంటున్న వీడియో సంచలనమైంది. సత్యేంద్ర జైన్ బెడ్‌పై పడుకుని ఉండగా...ఓ వ్యక్తి ఆయన కాళ్ల దగ్గర కూర్చుని మసాజ్ చేస్తూ కనిపించాడు. జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని కొన్ని రోజులుగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోతో అది నిజమైన రుజువైంది. ఇప్పటికే ఈడీ ఆయనకు వీఐపీ ట్రీట్‌మెంట్ లభిస్తోందని ఆరోపిస్తోంది. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఆయన జైల్లో చాలా విలాసంగా గడుపుతున్నారని అందులో పేర్కొంది. మసాజ్ కూడా చేయించుకుంటున్నాడని తెలిపింది. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ఇప్పుడు సీసీటీవీ విజువల్స్ బయటకు వచ్చాయి.


సత్యేంద్ర జైన్‌కు అక్కడి సిబ్బంది అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని...ఫుడ్, వాటర్ బయట నుంచి స్పెషల్‌గా తెప్పిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రత్యేకంగా మినరల్ వాటర్ తెప్పించుకుంటున్నట్టూ చెబుతున్నారు. ఈ వీడియోలో మినరల్ వాటర్ బాటిల్స్ కూడా కనిపించడం వల్ల అది కూడా నిజమని తేలింది. దీనిపై ఇప్పటికే రాజకీయాలు మొదలయ్యాయి. బీజేపీ...ఆప్‌పై డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టింది. ఆప్ మంత్రులెవరూ జైల్లో శిక్ష అనుభవించడం లేదని, అందుకు బదులు చాలా విలాసంగా, సంతోషంగా గడుపుతున్నారని మండి పడింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. జైలుకు వెళ్లి మరీ సత్యేంద్ర జైన్‌ను కలవడానికి వచ్చిందెవరో కనుక్కోవాలని, ఆయన చేతిలో ఉన్న ఫైల్స్ వివరాలనూ బయట పెట్టాలని గట్టిగా అడుగుతోంది. ఇప్పుడిప్పుడే ఆప్ నేతల నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయని చెబుతోంది. 


Also Read: China Factory Fire: ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం- 36 మంది మృతి