Income Tax Department TDS: పన్ను చెల్లింపుదారుడు పొందిన ఆదాయాల మీద ఆదాయ పన్ను ముందే కట్‌ అవుతుంది. దీనినే TDS (Tax Deducted at Source) అంటారు. TDS రేటు ఎంత ఉంటుందన్నది మీరు స్వీకరించే ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా మీరు వివిధ పన్ను స్లాబ్ రేట్లలోకి వస్తారు. పన్ను స్లాబ్ ప్రకారం, జీతం మీద TDS డిడక్షన్‌ రేటు 10 శాతం నుంచి 30 శాతం వరకు ఉంటుంది.


ఇక, ఆదాయపు పన్ను విభాగానికి సంబంధించిన ఏ పని పూర్తి కావాలన్నా శాశ్వత ఖాతా సంఖ్య (Permanent Account Number - PAN) అవసరం. ఒకవేళ మీరు మీ TDSని (Tax Deducted at Source) క్లెయిమ్ చేయాలని అనుకుంటే, దానికి పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. మీ పాన్‌ ద్వారానే మొదట TDS డిడక్ట్‌ అయి, తర్వాత మీకు క్రెడిట్‌ అవుతుంది.


ఆశ్చర్యకరంగా, TDS క్లెయిమ్ చేయడానికి పాన్ కార్డ్ అవసరం లేని వాళ్లు కూడా ఉన్నారు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, కొన్ని షరతులకు లోబడి కొందరికి మినహాయింపు ఉంది.  


ఆదాయపు పన్ను శాఖ అందించిన సమాచారం ప్రకారం... మీరు నాన్ రెసిడెంట్ ఇండియన్ (NRI) అయితే, 2023 మార్చి 31వ తేదీ నాటికి 10Fని మాన్యువల్‌గా పూర్తి చేయవచ్చు. దీని వల్ల, TDS క్లెయిమ్ చేస్తున్నప్పుడు NRIలకు ఎలాంటి సమస్య ఎదురు కాదు. TDSని క్లెయిమ్ చేయడానికి 10F ఫామ్ ఎలక్ట్రానిక్ మోడ్‌ను జూలై 2022లో ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. ఈ ఎలక్ట్రానిక్‌ ఫామ్‌ను పూర్తి చేయడం తప్పనిసరి చేసింది.


పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులు
10Fను ఎలక్ట్రానిక్ మోడ్‌లో పూర్తి చేయడాన్ని ఆదాయపు పన్ను విభాగం తప్పనిసరి చేసిన తర్వాత, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతకు ముందు, ఆదాయపు పన్ను పోర్టల్‌లోనే 10F ఫామ్‌ను పూర్తి చేయడానికి పన్ను చెల్లింపుదారులకు అనుమతి ఉండేది కాదు. కొంతమందికి పాన్ కార్డ్ లేకపోవడంతో ఫామ్ నింపడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఈ ఫామ్‌ను మాన్యువల్‌గా నింపడానికి ఆదాయపు పన్ను విభాగం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు, 31 మార్చి 2023 వరకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఫామ్ 10Fను పన్ను చెల్లింపుదారులు నింపవచ్చు.


నోటిఫికేషన్ ద్వారా సమాచారం
డిసెంబర్ 12, 2022న ఆదాయపు పన్ను విభాగం జారీ చేసిన ప్రకటన (నోటిఫికేషన్) ప్రకారం... జులై 2022 నుంచి ఎలక్ట్రానిక్‌ మోడ్‌లో పూర్తి చేస్తున్న ఫామ్ 10Fని, నాన్ రెసిడెంట్ కేటగిరీ ‍‌(NRI) పన్ను చెల్లింపుదారులు మార్చి 31, 2023 లోపు మాన్యువల్‌గా పూర్తి చేయాలి. జులైలో, ఫామ్ 10Fను ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో పూరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది కాబట్టి, పాన్ కార్డ్ లేని చాలా మంది ఫామ్‌ను పూరించలేకపోయారు. ఇప్పుడు PAN లేని వ్యక్తులు కూడా మాన్యువల్‌గా ఈ ఫామ్‌ను నింపవచ్చు.