No more tech hiring in India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ అన్నా.. భారతీయులు అన్నా పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక నుంచి అమెరికా టెక్ కంపెనీలు భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వవొద్దని ఆయన హుకుం చేశారు చేశారు. గురువారం వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సమ్మిట్‌లో అమెరికా టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు విదేశీయులను, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులను నియమించుకోవద్దని హెచ్చరించారు. అమెరికా కంపెనీలు "అమెరికా ఫస్ట్" విధానాన్ని అనుసరించాలని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారతదేశం, చైనా వంటి దేశాలలో కంపెనీలు ఫ్యాక్టరీలు నిర్మించడం, భారతీయ ఐటీ నిపుణులను నియమించడం వల్ల అమెరికన్ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయనంటున్నారు. టెక్ ఇండస్ట్రీ "గ్లోబలిస్ట్ మైండ్‌సెట్"ను వదిలేయాలన్నారు. అమెరికన్ స్వేచ్ఛను ఉపయోగించుకుని లాభాలు ఆర్జించిన టెక్ కంపెనీలు, చైనాలో ఫ్యాక్టరీలు నిర్మించడం, భారతదేశంలో ఉద్యోగులను నియమించడం, ఐర్లాండ్‌లో లాభాలను నిల్వ చేయడం వంటి చర్యలను పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ట్రంప్ గతంలో కూడా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై పరిమితులను విధించేందుకు ప్రయత్నించారు. 2017లో, "బై అమెరికన్, హైర్ అమెరికన్" అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా హెచ్-1బీ వీసాలను అత్యంత నైపుణ్యం కలిగిన లేదా అత్యధిక వేతనం పొందే అభ్యర్థులకు మాత్రమే ఇవ్వాలని ఆదేశించారు. ఈ విధానం మళ్లీ కొనసాగే అవకాశం ఉందని, ఇది భారతీయ ఐటీ నిపుణులకు సవాళ్లను తెచ్చిపెడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హెచ్-1బీ వీసా కార్యక్రమం భారతీయ నిపుణులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలను అందించే ప్రధాన మార్గం. 2023లో మొత్తం 3,80,000 హెచ్-1బీ వీసాలలో 72 శాతం భారతీయులకు లభించాయి, ముఖ్యంగా డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్‌సెక్యూరిటీ వంటి రంగాలలో భారతీయులు ఎక్కువగా ఉద్యోగాలు పొందుతున్నారు. ట్రంప్ విధానాలు ఈ వీసాల పరిమితిని మరింత కఠినతరం చేస్తే, భారతీయ ఐటీ నిపుణులకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది. భారతీయ ఐటీ సర్వీస్ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడతాయి. ఆంక్షలు విధించడం వల్ల భారతీయ ఔట్‌సోర్సింగ్ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోలన వ్యక్తమవుతోంది.
అయితే అవడానికి అమెరికా కంపెనీలే అయినా.. అవి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాల నుంచి ప్రతిభావంతులైన వారిని నియమించుకుంటూ ఉంటాయి. కేవలం అమెరికాకే పరిమితమైన కంపెనీ అయితే.. అమెరికన్లను నియమించుకోవాలని డిమాండ్ చేయడంలో ఓ అర్థం ఉంటుంది కానీ.. ఇదేం పద్దతన్న ప్రశ్నలువస్తున్నాయి.