కశ్మీరీ పండిట్‌లకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం..
2019 ఆగష్టు 5వ తేదీ తరవాత ఒక్క కశ్మీరీ పండిట్ కూడా కశ్మీర్ నుంచి వెళ్లిపోలేదని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దు
తరవాత 21 మంది ముస్లిమేతర కశ్మీరీ పండిట్‌లు సహా బయటి వ్యక్తులు హత్యకు గురయ్యారని, అయినా కశ్మీరీ పండిట్‌లు ఎక్కడికీ వలస
వెళ్లిపోలేదని స్పష్టం చేసింది. "2019 ఆగస్టు 5వ తేదీ నుంచి 2022 జులై 19వ తేదీ వరకూ ఉగ్రవాదులు 118 మంది పౌరులు, 129 మంది భద్రతా సిబ్బందిని దారుణంగా హత్య చేశారు. 118 మంది పౌరుల్లో ఐదుగురు కశ్మీరీ పండిట్‌లు కాగా 16 మంది హిందూ,సిక్ కమ్యూనిటికీ చెందిన వారున్నారు. ఏ ఒక్క యాత్రికుడు హత్యకు గురి కాలేదు" అని కేంద్రం తెలిపింది. ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించింది. ఇటీవల జరిగిన హత్యల కారణంగా కశ్మీర్ నుంచి ఎంత మంది కశ్మీరీ పండిట్‌లు వలస వెళ్లారన్న ప్రశ్నకు ఈ సమాధానమిచ్చింది. "ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజ్‌లో భాగంగా 5,502 మంది కశ్మీరీ పండిట్‌లకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఏ ఒక్క కశ్మీరీ పండిట్ కూడా వలస వెళ్లలేదు"అని చెప్పింది.
ఉగ్రవాదుల దాడులు తగ్గిపోయాయ్..
2021 తరవాత కశ్మీర్ వ్యాలీలో వరుస హత్యలు జరిగాయి. ఈ క్రమంలోనే చాలా మంది కశ్మీరీ పండిట్‌లు వలస వెళ్లిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కశ్మీరీ పండిట్‌లు సంచలన ఆరోపణలు కూడా చేశారు. తమపై కఠిన చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా కశ్మీర్‌లోనే ఉంచుతున్నారని చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం కశ్మీర్‌లో ప్రజలకు భద్రత కల్పించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది. "ఉగ్రవాదం విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నాం. జమ్ము, కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశాం. 2018లో ఉగ్రదాడులు 417గా ఉండగా, 2021కి ఆ సంఖ్య 229కి తగ్గాయి" అని తెలిపింది. కశ్మీరీ పండిట్లకు 6 వేల ఆవాసాలు కట్టించి ఇచ్చేందుకు ఆమోదం తెలిపామని వెల్లడించింది. వీటిలో ఇప్పటికే 1,025 యూనిట్ల నిర్మాణం పూర్తైందని, 1,872 యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొంది. నేషనల్ హైవేస్, కాలేజీలు, స్కూల్స్ కట్టేందుకు అవసరమైన భూసేకరణ కొనసాగుతోందని వివరించింది. పార్క్‌లు, బిల్డింగ్‌లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లు నిర్మించేందుకూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటన్నట్టు తెలిపింది. ఈ నిర్మాణాల కోసం 2,359 హెక్టార్ల భూమిని సేకరించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తానికి కశ్మీరీ పండిట్‌ల హత్యలు జరుగుతున్న సమయంలో కేంద్రం ఈ గణాంకాలు వెల్లడించటం ప్రాధాన్యత సంతరిచుకుంది.