Nitish Kumar Was Offered PM Post: ఇండీ కూటమి జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవి ఆఫర్ చేసిందంటూ ఆ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. ఇండీ కూటమిలోకి వచ్చేందుకు ప్రధాని పదవిని ఆశ చూపించారని JDU నేత కేసీ త్యాగి వెల్లడించారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సీఎం పదవి వదులుకుని వస్తే ఏకంగా పీఎం పోస్ట్‌నే ఇస్తామని చెప్పినట్టు వివరించారు. కానీ ఆయన ఆ ఆఫర్‌ని వద్దనుకుని NDA కూటమితోనే కలిసి వెళ్లేందుకు మొగ్గు చూపారని స్పష్టం చేశారు కేసీ త్యాగి. 


"ఇండీ కూటమి నితీశ్ కుమార్‌కి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది. కూటమికి కన్వీనర్ అవ్వాలనుకున్న సమయంలో ఎవరూ లెక్క చేయలేదు. ఆ పదవిలో కూర్చోబెట్టకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు వాళ్లే ఆయనకు ప్రధాని పదవిని ఆశ పెడుతున్నారు. అందుకే నితీశ్ వాళ్ల ఆఫర్‌ని తిరస్కరించారు. NDAతో కూటమితోనే ఉంటానని స్పష్టం చేశారు"


- కేసీ త్యాగి, జేడీయూ నేత 


ఇండీ కూటమి ప్రయత్నాలు..?


NDA కూటమిలో ఉన్న టీడీపీ, జేడీయూని తమ వైపు తిప్పుకునేందుకు ఇండీ కూటమి ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్న క్రమంలోనే త్యాగి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఎప్పుడూ లేని స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఈ సారి NDA కి గట్టి  పోటీ ఇచ్చి నిలబడింది. 234 స్థానాల్లో విజయం సాధించింది. అటు NDA 293 స్థానాలు గెలుచుకుంది. 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ 240 సీట్లకు పరిమితమైంది. అయితే...ఇండీ కూటమి నుంచి నితీశ్‌కు ఎవరు ప్రధాని పదవిని ఆఫర్ చేశారన్న విషయం మాత్రం బయటకు రాలేదు. ఆ వ్యక్తి పేరుని చెప్పేందుకు కేసీ త్యాగి ఇష్టపడలేదు. "కొంత మంది చెప్పారు" అని సమాధానం దాటవేశారు. పదేపదే కూటములు మార్చే నితీశ్ కుమార్ ఎన్ని రోజులు NDAలో ఉంటారో అన్న సందిగ్ధత నెలకొంది. 


ఇదే విషయాన్ని మీడియా ప్రస్తావించగా కాంగ్రెస్‌ ఎటూ తేల్చలేదు. అసలు ఆ సమాచారమే తమ వద్ద లేదని స్పష్టం చేసింది. కేసీ వేణుగోపాల్ ఈ సమాధానమిచ్చారు. ఆ తరవాత ఆ టాపిక్‌ని మార్చేశారు. కాంగ్రెస్‌ అంతకు ముందు కన్నా మంచి ఫలితాలు రాబట్టుకుందని ఆ సమాధానాన్ని దాటవేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని చోట కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించుకుంటామని వెల్లడించారు. 






Also Read: Modi's Swearing-in: G20 సమ్మిట్‌ నాటి రోజుల్ని గుర్తు చేస్తున్న ఢిల్లీ, మోదీ ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత