Free Travel For women in Telangana: నిర్మల్: తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం (Mahalakshmi scheme)లో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని హామీల అమలు ఫైలుపై సంతకాలు చేశారు. డిసెంబర్ 9 నుంచి నగరాలలో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో.. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు, ఓనర్లు కడెం ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు.


నిర్మల్ జిల్లా ( Nirmal District) కడెం మండల కేంద్రంలో మండల ఆటో, టాటా మ్యాజిక్ డ్రైవర్లు, ఓనర్లు కడెం ప్రధాన రహదారిపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడంతో ఆటో టాటా మ్యాజిక్ డ్రైవర్లు ఓనర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి వాహనాలు కొనుగోలు చేసి ఈఏంఐ లు కట్టుకుంటూ ఆటో టాటా మ్యాజిక్ లు నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటే ఒక్కసారిగ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగం అయ్యాయని మండిపడుతున్నారు. వెంటనే మహాలక్ష్మి పథకాన్ని ఎత్తివేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆటో టాటా మ్యాజిక్ జీపు డ్రైవర్లు ఓనర్లు పాల్గొన్నారు.


డిసెంబర్ 9న మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో మహిళలకు పలు బస్ సర్వీసుల ద్వారా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. కానీ ఆర్టీసీలో ఉచితం కావడంతో మహిళలు, బాలికలు, విద్యార్థినులు ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలలో ప్రయాణం దాదాపుగా తగ్గించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం తమ ఆదాయానికి గండి కొట్టిందని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ప్రభుత్వం ఇది గుర్తించాలన్నారు. వీలైతే ఉచిత ప్రయాణం స్కీమ్ రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రైవేట్ వాహనాల వారిని నెలవారీగా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని డిమాంండ్ చేశారు.