Private secretary to PM Modi Nidhi Tewari : ప్రధానమంత్రి  మోదీ వ్యక్తిగత కార్యదర్శిగా   క్యాబినెట్ నియామక కమిటీ  నిధి తివారి నియామకాన్ని ఆమోదించింది.  నియామకం వెంటనే అమలులోకి వచ్చింది. క్యాబినెట్ నియామక కమిటీ, ప్రస్తుతం ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ IFS  ను ప్రధానమంత్రి   వ్యక్తిగత కార్యదర్శిగా నియమించడానికి ఆమోదం తెలిపిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.  ఈ నియామకం లెవెల్ 12 పే మ్యాట్రిక్స్‌లో వెంటనే అమలులోకి వస్తుంది. ఈ నియామకం వల్ల  PMOలో నిధి తివారీ అత్యంత కీలక పాత్ర పోషిస్తారు.  ఆమె ముఖ్యమైన వ్యవహారాలు చూస్తారు.  కార్యకలాపాలను సమన్వయం చేస్తారు .

నిధి తివారీ 2014 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని మెహ్ముర్గంజ్ స్వస్థలం. మోదీ కూడా వారణాశి నుంచి ఎంపీగా ఉన్నారు.  వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు.  2013లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. ఆ ర్యాంక్‌కు ఆమెకు ఐఏఎస్ లేదా ఐపీఎస్ క్యాడర్ వచ్చేది. కానీ ఆమె ఇండియన్ ఫారెన్ సర్వీస్ కోరుకున్నారు. మొదట్లో  MEAలోని డిసార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ డివిజన్‌లో పనిచేశారు. ఈ విభాగం నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు నివేదికలు ఇస్తుంది.  

నిధి తివారి  2022 నవంబర్‌లో PMOలో అండర్ సెక్రటరీగా చేరారు. 2023 జనవరి నుండి ఆమె డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తూ, 'విదేశీ భద్రత' విభాగాన్ని నిర్వహించారు. ఈ విభాగం కూడా NSA అజిత్ దోవల్‌కు నివేదిస్తుంది. ఆమె బాధ్యతలలో విదేశాంగ వ్యవహారాలు, అణు శక్తి, భద్రతా వ్యవహారాలు ఉంటాయి. ఇప్పుడు  ప్రధానమంత్రి  వ్యక్తిగత కార్యదర్శిగా నిధి తివారీ ప్రధానమంత్రి మోదీకి అత్యంత సన్నిహిత  అధికారుల్లో ఒకరు.  PMOలో అధికారిక, ప్రభుత్వ ఫైల్స్ నిర్వహించడం,   PMOలోని కార్యకలాపాల సమన్వయం, ప్రధాన మంత్రి కోసం ముఖ్య విషయాలపై నోట్స్ సిద్ధం చేయడం వంటి కార్యకలాపాలు ఆమె నిర్వహించాల్సి ఉంటుంది.   

అజిత్ ధోబాల్ భారత విదేశాంగ విధానం, అంతర్గత రక్షణలో కీలక పాత్ర పోషిస్తారు. ఆయన వద్దనే నిధి తివారీ ఎక్కువ కాలం పని చేయడంతో ఈ నియామకంలో ఆయన సిఫారసు పని చేసిందని అనుకుంటారు. పీఎంవోలో పని చేయాలంటే.. అత్యంత సమర్థతతో పాటు నమ్మకంగా ఉండే అధికారులను మాత్రమే నియమిస్తారు. ఆ నమ్మకాన్ని నిధి తివారి చిన్న వయసులోనే సాధించారు.