NIA Officials Attacked in Bengal: యాంటీ టెర్రర్ ఏజెన్సీ NIA అధికారులు పశ్చిమ బెంగాల్‌లో 2022 నాటి భూపతినగర్‌ బాంబు పేలుళ్ల కేసులోని ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. మెదినిపూర్‌ జిల్లాలో సోదాలు నిర్వహించి వాళ్లని అరెస్ట్ చేశారు. అయితే...భూపతినగర్‌లో సోదాలు చేసేందుకు వచ్చిన NIA టీమ్‌పై స్థానికులు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ అధికారి గాయపడ్డాడు. బాంబు పేలుడు కేసులో నిందితులైన బలాయ్ చరణ్, మనోబాత్రా జనాని కస్టడీలోకి తీసుకున్నారు. సోదాలు చేస్తున్న సమయంలోనే ఉన్నట్టుండి కొందరు గుంపుగా వచ్చి దాడి చేశారు. NIA అధికారులు వచ్చిన వాహనంపైనా దాడి జరిగింది. కార్ ముందు అద్దం ధ్వంసమైంది. చుట్ట పక్కల ఉన్న కొన్ని వాహనాలూ ధ్వంసమయ్యాయి. అరెస్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుండగా కొందరు ఇలా దాడి చేసి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే...ఈ ఘటనపై NIA అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. NIA వెల్లడించిన వివరాల ప్రకారం...కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులు క్రూడ్ బాంబ్‌లు తయారు చేస్తున్నారు. మెదినిపూర్‌లో ఓ ఇంట్లో వీటిని నిల్వ ఉంచారు. 2022 డిసెంబర్‌లో ఒక్కసారిగా ఈ బాంబులు పేలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీన పశ్చిమ బెంగాల్ పోలీస్‌లు ఈ ఘటనపై FIR నమోదు చేశారు.  Explosive Substances Act కింద మాత్రం కేసు నమోదు చేయలేదు. ఆ తరవాతే కోల్‌కత్తా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్నీ FIRలో చేర్చాలని ఆ పిటిషన్‌ కోర్టుని కోరింది. అంతే కాదు. ఈ కేసుని NIAకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 






కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని NIAకి బదిలీ చేశారు. అప్పటి నుంచి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు అధికారులు. పక్కా సమాచారం అందుకుని మెదినిపూర్‌కి వచ్చి సోదాలు నిర్వహించారు. అప్పుడే ఈ దాడి జరిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. NIA అధికారులు బీజేపీ కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి వచ్చి సోదాలు చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. అసలు వాళ్లకి పోలీసులు అనుమతి ఉందా అంటూ మండి పడ్డారు. ఒక్కసారిగా ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అర్ధరాత్రి పూట ఇళ్లలోకి వస్తే ఎవరైనా అలాగే స్పందిస్తారంటూ దాడి చేస్తారని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు కావాలనే ఇలా అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీతో పోరాటం చేయడానికి ప్రపంచమంతా ఏకం కావాలని అసహనం వ్యక్తం చేశారు.