Nepal Aircraft Crash:


67 మంది మృతి..


నేపాల్‌లో విమానం కుప్ప కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అధికారులు అందించిన సమాచారం ప్రకారం...ఇప్పటి వరకూ 67 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో 72 మంది విమానంలో ఉండగా...67 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం పాటించనున్నట్టు ప్రకటించింది. ఈ ఫ్లైట్‌లో మొత్తం 53 మంది నేపాలీలు ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు. ఫ్లైట్‌లో 15 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ఆరుగురు చిన్నారులూ ఉన్నారు. 53 మంది నేపాలీలు, 5గురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు కొరియన్లతో పాటు అర్జెంటీనాకు చెందిన ఓ ప్రయాణికుడూ ప్రమాద సమయంలో విమానంలోనే ఉన్నారు. ఐర్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌కు చెందిన ప్రయాణికులూ మృతి చెందారు. ఇప్పటికే వెలికి తీసిన మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం వల్ల సహాయక చర్యలు చేపట్టేందుకు ఇబ్బందిగా మారింది. ఈ ప్రమాదం ఎందుకు జరిగిందన్నది పూర్తి స్థాయిలో ఇంకా తేలలేదు. కేవలం సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. 










ఇవీ వివరాలు..


1. ఉదయం 10.33 గంటలకు ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయల్దేరింది. 
2. పొఖారా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అయ్యే ముందు సేటి నది పక్కనే ఉన్న వాగులో కుప్ప కూలింది. టేకాఫ్ అయిన 20 నిముషాలకే ఈ ప్రమాదం సంభవించింది. సాధారణంగా ఖాట్మండు నుంచి పొఖారాకు రావడానికి 25 నిముషాలు పడుతుంది. సరిగ్గా పొఖారా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందు కుప్ప కూలింది. 
3. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయట పడతారని అధికారులు భావించడం లేదు. ప్రమాద తీవ్రత అలా ఉంది. 
4. క్రాష్ అయిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు. 
5.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 
ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 
6. గతేడాది మే 29న కూడా నేపాల్‌లో ఇలాంటి ఘోర ప్రమాదమే జరిగింది. తారా ఎయిర్‌ ప్లేన్ కుప్ప కూలిన ఘటనలో 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 


Also Read: Nepal Plane Crash: నేపాల్‌లో విమానం క్రాష్ అయ్యే కొన్ని క్షణాల ముందు జరిగింది ఇదే! వైరల్ వీడియో