ఆనంపై అప్పుడే ఎదురుదాడి మొదలు పెట్టింది వైసీపీ. నిన్న మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్న మంత్రి కాకాణ గోవర్దన్ రెడ్డి అప్పుడే రూటు మార్చారు. ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఖండించారు కాకాణి. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరం అని చెప్పారు. ఓట్లకోసం ఎవరూ పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే పెన్షన్లు పెంచి ఇస్తున్నామని చెప్పారు. వర్షాలు పడితే రోడ్లు దెబ్బతినడం సాధారణమేనన్న ఆయన, రోడ్ల మరమ్మతులకోసం


గత ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు చేశారు, తమ హయాంలో ఎంత వెచ్చిచ్చామో చర్చిద్దామని పిలుపునిచ్చారు. ఎవరో విమర్శిస్తే ప్రభుత్వాలు మారిపోవని, ఎవరు అధికారంలో ఉండాలో సంక్షేమం అందుకొంటున్న ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.


అధిష్టానం ఆదేశాలు..


గతంలో ఆనం రామనారాయణ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ నుంచి కనీసం ఖండనలు ఉండేవి కావు. కానీ ఈసారి ఆనంను పక్కనపెట్టడానికి సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. వెంకటగిరికి ఇన్ చార్జిని కూడా పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికే టికెట్ ఖాయం అన తేల్చేసినట్టు ఆయనకు ఇన్ చార్జ్ పదవి ఇచ్చారు. అందే రామనారాయణ రెడ్డికి ఇక వైసీపీలో చోటు లేదన్నమాట. దీనితోపాటు ఆనం వ్యాఖ్యలను ఖండించే బాధ్యత సీనియర్లకు అప్పగించారు జగన్.


కాకాణి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఫ్లెక్సీల విషయంలో సిటీ ఎమ్మెల్యే అనిల్ తో కూడా ఆనం వర్గానికి గొడవ జరిగింది. అప్పట్లో ఆయన అంత ఘన సన్మానాలు చేసినా ఇప్పుడు ఆనంని వ్యతిరేకించే విషయంలో కాకాణి పార్టీపై ఉన్న లాయల్టీని చూపించుకున్నారు. ఆనం వ్యాఖ్యలను కాకాణి తీవ్రంగా ఖండించారు.


ఇక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్వరం పెంచారు. రోజుకొక పార్టీ మారే వారి గురించి నేను మాట్లాడటమా అని అన్నారు. ముందస్తు ఎన్నికలొస్తే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమంటూ వెంకటగిరి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అనీల్ ఘాటుగా స్పందించారు. ఆయన జోతిష్యాలు ఏమైనా చెప్పించుకున్నాడేమో అంటూ వ్యాఖ్యానించారు. రోజుకో పార్టీ మారేవాళ్ల గురించి తాను మాట్లాడనని గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు అనిల్.


ఆనం ఒంటరి..


ప్రస్తుతం వైసీపీలో ఆనంను ఎవరూ సమర్థించేవారు లేరు, పార్టీయే దూరం పెట్టింది కాబట్టి.. ఇక అందరూ ఆనంపై తిరుగుబాటు చేయడం ఖాయం. గతంలో శతృత్వం ఉన్నవారు, కొత్తగా శత్రువులుగా మారుతున్నవారు.. ఇలా అందరితో ఆనంకి చిక్కు వచ్చే ప్రమాదం ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి ఇక  వైసీపీ తరపున కార్యక్రమాలు కూడా చేసే అవకాశం లేదు. పార్టీ ఆయన్ని దూరం పెట్టడంతో, ఆయన కూడా పార్టీకి మరింత దూరమయ్యే అవకాశముంది. అయితే కొత్తగా ఎక్కడినుంచి పోటీ చేయాలి, ఏ పార్టీకి దగ్గరవ్వాలి అనే విషయాలపై ఆనం క్లారిటీ తీసుకోవాల్సి ఉంది. ఆనం వస్తానంటే అన్ని పార్టీలు దగ్గరకు తీసుకుంటాయి. కానీ వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది బేరీజు వేసుకుని ఆనం వ్యూహాత్మక రాజకీయాలు చేస్తారని తెలుస్తోంది.