BJP MP Anant Kumar Hegde: కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే భారత రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగాన్ని పూర్తిగా తిరిగి రాయాల్సిన అవసరం ఉందని అనడం రాజకీయంగా సంచలనమైంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం హిందూమతాన్ని తక్కువ చేస్తూ కుట్రపూరితంగా రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసిందని ఆరోపించారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"బీజేపీ 400 చోట్ల విజయం సాధించేలా మీరే సహకరించాలి. బీజేపీకి 400కి పైగా స్థానాలు రావాలని కోరుకోడానికి ఓ బలమైన కారణముంది. గతంలో కాంగ్రెస్ నేతలు రాజ్యాంగంలో చాలా సవరణలు చేశారు. హిందూమతానికి వ్యతిరేకంగా మార్పులు చేర్పులు చేశారు. మన మతాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని మరోసారి తిరిగి రాయాలి. లోక్‌సభలో ఇప్పటికే మాకు మూడింట రెండొంతుల మెజార్టీ ఉంది. కానీ రాజ్యసభలో తగినంత బలం లేదు. అందుకే 400కి పైగా స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగంలో సవరణలు చేపట్టేందుకు అవకాశం వస్తుంది. అలా అయితేనే రాజ్యాంగ సవరణకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. "
- అనంత్ కుమార్ హెగ్డే, బీజేపీ ఎంపీ
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. ఈ క్రమంలోనే అనంత్ కుమార్ హెగ్డే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. కొద్ది రోజుల కిందటే ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజ్యాంగ సవరణల గురించి ప్రస్తావించారు. రాజ్యాంగం శక్తేమిటో తెలియకుండానే కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు.
"అధికారంలోకి రాగానే రాజ్యాంగంలో పలు సవరణలు చేస్తాం అని చెబుతున్నారు. వాళ్లకి అసలు రాజ్యాంగం ఎంత శక్తిమంతమైందో తెలిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం ఎంత గొప్పదో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం అందుకు తోడ్పడుతుంది"
- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి
గతంలో కొంతమంది సీనియర్ నేతలు ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజ్యాంగంలో సవరణలు చేసేందుకు కుట్ర చేస్తోందని మండి పడ్డారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం...ఈ వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అలాంటి ఆలోచనే తమకు లేదని తేల్చిచెప్పారు.