Student Protesters Threats Police Van:  పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఒక పోలీస్ అత్యంత దారుణంగా ప్రవర్తించిన తీవ్ర సంచలనంగా మారింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ముంబై వ్యాప్తంగా సాగుతున్న ఆందోళనల్లో భాగంగా పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ వ్యాన్‌లో నిర్బంధించిన విద్యార్థులను ఉద్దేశించి ఓ పోలీస్ ఆఫీసర్  తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, వారిపై అబద్ధపు కేసులు మోపుతానని బహిరంగంగా బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Continues below advertisement

ఈ ఆందోళనకర వీడియోను ముంబై కాంగ్రెస్ ప్రతినిధులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వ్యాన్ నడుపుతున్న ఆ పోలీస్ సిబ్బంది వెనుక సీట్లో ఉన్న విద్యార్థులతో తీవ్ర అభ్యంతరకర రీతిలో మాట్లాడాడు. మళ్లీ గనుక నిన్ను నిరసన వేదికల వద్ద చూస్తే నా అంత దారుణమైన వ్యక్తి మరొకరు ఉండరు. మీ జేబుల్లో 50 గ్రాముల డ్రగ్స్ పౌడర్ పెట్టి డ్రగ్స్ కేసు నమోదు చేస్తాను. దానితో మీ జీవితాలు పూర్తిగా నాశనమవుతాయి, అసలు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే కుళ్ళిపోవాల్సి వస్తుంది  అని సదరు పోలీసు బహిరంగంగా బెదిరించాడు.  

పోలీస్ అధికార దుర్వినియోగానికి, బెదిరింపు చర్యలకు అద్దం పడుతున్న ఈ వీడియో లీక్ కావడంతో విద్యార్థులు, హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు అబద్ధపు కేసులు బనాయిస్తానని హెచ్చరిస్తూనే, మరోవైపు ఆ పోలీసు అధికారి తన ఆవేదనను కూడా వెళ్లగక్కారు.  మీ నిరసనల వల్ల మేము ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది, నరకం చూస్తున్నాం  అని బాహాటంగా వ్యాఖ్యానించాడు. అయితే పోలీస్ అంత తీవ్ర స్థాయిలో భయపెడుతున్నప్పటికీ, వెనుక సీట్లలో ఉన్న విద్యార్థులు మాత్రం నవ్వుతూ దాన్ని తేలిగ్గా తీసుకోవడం వీడియోలో కనిపిస్తుంది.  

ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ కావడంతో ముంబై పోలీస్ శాఖ తీవ్ర ఒత్తిడిలో పడింది. శాంతియుత నిరసనలు తెలిపే హక్కు ఉన్న విద్యార్థులపై ఇలాంటి తీవ్రమైన అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసు వ్యవస్థ విశ్వసనీయతకే ఇది మచ్చ తెచ్చేలా ఉండటంతో ముంబై పోలీస్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. సంఘటనపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేశామని, నివేదిక ఆధారంగా సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.