NASA: ఐడియా చెప్పండి, రూ.16 లక్షలు పట్టుకెళ్లండి - వారికి నాసా బంపరాఫర్
Moon Mission: త్వరలో జాబిల్లిపై చేయబోయే ప్రయోగాల్లో వ్యోమగాముల రక్షణ కోసం ఉద్దేశించిన డిజైన్లను నాసా ఆహ్వానిస్తోంది. ఇందులో గెలిచిన వారికి భారీగా ప్రైజ్ మనీ ఇస్తోంది.
NASA: అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ ఏజెన్సీ.. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) అంతరిక్ష ప్రియులకు బంపరాఫర్ ప్రకటించింది. ఖగోళ పరీక్షలకు సంబంధించి ఒక డిజైన్ రూపొందించాలని అందుకుగాను బహుమానాన్ని కూడా ప్రకటించింది. 2026లో చంద్రునిపైకి వ్యోమగాములతో కూడిన మిషన్‌ను అమెరికా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించే ఒక కంటెస్టును నాసా తాజాగా ప్రకటించింది.
వ్యోమగాముల సురక్షితం కోసం..
చంద్రునిపైకి అమెరికా వెళ్లడం ఇప్పుడే తొలిసారి. టెక్నాలజీ అంతగా అభివృద్ది చెందని కాలంలోనే అంటే 60వ దశకంలోనే జాబిల్లిపై అమెరికా మనుషులు అడుగుపెట్టారు. అయితే ఇప్పుడు సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ చంద్రునిపైకి మనుషులను పంపిస్తున్న నాసా.. అక్కడ ఎదురయ్యే ప్రమాదాలను ఊహించి, వాటిని ఎదుర్కొనే డిజైన్లను రూపకల్పన చేసే వారి కోసం ఒక ప్రకటన జారీ చేసింది. చంద్రునిపై వ్యోమగాములకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే, వారిని సురక్షితంగా ల్యాండర్ వద్దకు తరలించడం కోసం డిజైన్లను రూపొందించాలని కోరింది. ఈ పోటీల్లో గెలిచిన వారికి రూ.16 లక్షల భారీ ప్రైజ్ మనీని కూడా అనౌన్స్ చేసింది.
చంద్రునిపై బరువు తక్కువే..
నిజానికి చంద్రుడు భూమి బరువులో మూడో వంతు మాత్రమే ఉంటాడు. దీంతో గురుత్వాకర్షణ శక్తి కూడా తక్కువ. అందుచేత ఇక్కడ ఉన్నంత బరువు చంద్రునిపై ఉండదు. అయినా కూడా అక్కడ సవాళ్లు చాలానే ఉన్నాయి. ఎలాంటి వాతావరణం లేకపోవడంతో పగలు బీభత్సమైన ఎండ, రాత్రుళ్లు ఎముకలు కొరికే చలి వంటి విపరీతమైన పరిస్థితులు ఉంటాయి. సో, అక్కడికి వెళ్లే వ్యోమగాములు స్పేస్ సూట్ ధరించడం తప్పనిసరి. ప్రయోగాల్లో భాగంగా, చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగాములకు ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురై, స్పృహ కోల్పోయే పరిస్థితి వస్తే, రోవర్లను ఉపయోగించకుండా వారిని నిర్దేశిత ప్రాంతాలకు తరలించడం కోసం సరికొత్త ఐడియాలను నాసా అడుగుతోంది.
లూనార్ రెస్క్యూ సిస్టమ్‌ను అభివృద్ధి చేసి, వచ్చే ఏడాది జనవరి 23లోపు ఔత్సాహికులు తమ ఐడియాలను HeroX పోర్టల్‌లో సమర్పించాలని నాసా వెల్లడించింది. చంద్రుడి ఉపరితలంపైకి వెళ్లిన తర్వాత గాయం, మెడికల్ ఎమర్జెన్సీ, మిషన్ సంబంధిత ప్రమాదాలు చోటు చేసుకుంటే వ్యోమగాములు అచేతన స్థితికి వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు తోటి క్రూ సిబ్బంది వారిని లూనార్ ల్యాండర్ వద్దకు తిరిగి పంపాల్సి ఉంటుంది.
అర్టెమిస్ ప్రొగ్రాం ద్వారా..
చంద్రునిపై ఇప్పటికే చాలా దేశాల రోవర్లు, లాండర్లు నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. మన స్పేస్ ఏజేన్సీ.. ఇండియన్ స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) కూడా ప్రజ్నాన్ రోవర్‌ను చంద్రుని దక్షిణ భాగంపైకి దింపిన సంగతి విదితమే. ఈ క్రమంలో అమెరికా మరోసారి అక్కడికి మనుషులను పంపి, తన వాడిని ప్రపంచానికి మరోసారి చాటాలని గట్టి పట్టుదలతో ఉంది. అర్టెమిస్ మిషన్‌ను ప్రారంభించి, దశల వారీగా ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా రాకెట్‌ను రెండేళ్ల కిందట ప్రయోగించింది. మరోసారి పరీక్షల కోసం ఆర్టెమిస్-2ను ప్రయోగించిన తర్వాత 2026లో మానవ సహిత అర్టెమిస్-3 మిషన్‌ను చంద్రునిపైకి ప్రయోగించనుంది. దీని ద్వారా జాబిల్లిపై అనేక ప్రయోగాలు చేయాలని భావిస్తోంది. రాబోయే ప్రయోగాలకు సంబంధించి, జాబిల్లిని బేస్ పాయింట్‌గా వాడుకోవాలని కూడా ప్రణాళికలు రచిస్తోంది. మొత్తానికి మీరు ఖగోళ ప్రియులైతే.. మీ మెదడుకు పదును పెట్టి, సూపర్ ఐడియా ఇచ్చి, మీలియనీర్ కావచ్చు.