Tulasi Reddy: ఏపీ రాష్ట్ర పర్యటన కోసం ఇక్కడకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా అమలు చేస్తామని ప్రకటించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రకు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని సూచించారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు నిధులు విడుదల చేయాలని చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలన్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రకటించాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయమని చెప్పాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలోనే మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించాలని వ్యాఖ్యానించారు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక, రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రధాని మంత్రి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలన్నారు. ఇటీవల కాలలో రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని వివరించారు. నాలుగు రోజుల కిందట అనంతపురం జిల్లా బొమ్మణహాల్ మండలంలో విద్యుత్ తీగలు తెగిపడి 5 మంది రైతు కూలీలు మరణించారన్నారు. నిన్న ఆదివారం నాడు శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ పి కుంటలో విద్యుత్ తీగలు తెగిపడి రెడ్డప్ప రెడ్డి అనే రైతు మరణించారని గుర్తు చేశారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.
మొన్నటికి మొన్న మూడు రాజధానుల అంశంపై కామెంట్లు..
అసెంబ్లీ ఉన్న ప్రాంతాన్ని శాసన రాజధాని అనరు, అసెంబ్లీ అని మాత్రమే అంటారని, హై కోర్టు ఉన్న ప్రాంతాన్ని న్యాయ రాజధాని అనరని, హై కోర్టు అని మాత్రమే అంటారని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. పరిపాలన రాజధాని (రాష్ట్ర సచివాలయం)ఉన్న ప్రాంతాన్ని మాత్రమే రాష్ట్ర రాజధాని అంటారని తులసి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చెబుతున్న మూడు రాజధానుల మాట ఒక నాటకం అని, వికేంద్రీకరణ పాట ఒక బూటకం అంటూ మండిపడ్డారు. విషయం తెలియకుండా ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు 3 రాజధానుల జపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
పలు రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టులు..
హైకోర్టు ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర రాజధాని అనరని చెప్పారు. కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అస్సాం తదితర 13 రాష్ట్రాల్లో రాజధానుల వెలుపల హై కోర్టు లు ఉన్నాయని, వాటిని రాజధానులు అనడం లేదని చెప్పారు. కేరళ హైకోర్టు కొచ్చిన్ లో ఉందని, కానీ కొచ్చిన్ ను కేరళ రాజధాని అనరని, రాష్ట్ర సచివాలయం ఉన్న త్రివేండ్రం ను మాత్రమే కేరళ రాజధాని అంటారని చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఇకనైనా ఈ విషయాలను గుర్తించాలని తులసి రెడ్డి సూచించారు.