పెళ్లికి ఇది సరైన వయసే: పంజాబ్, హరియాణా హైకోర్ట్
ముస్లిం బాలికలు 16 ఏళ్లు దాటిన తరవాత తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్ట్ తీర్పునిచ్చింది. వివాహ జీవితంలోకి అడుగు పెట్టటానికి ఆ వయసు సరైందేననని స్పష్టం చేసింది. జస్టిస్ జస్జిత్ సింగ్ బేడి ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. ఓ ముస్లిం జంట కోర్టుని ఆశ్రయించి రక్షణ కోరిన క్రమంలో హైకోర్ట్ ఇలా స్పందించింది. 21 ఏళ్ల అబ్బాయి, 16 ఏళ్ల అమ్మాయి ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించలేదు. ఫలితంగా...హైకోర్ట్‌ని ఆశ్రయించి పిటిషన్ వేశారు ఇద్దరూ. ప్రేమలో పడిన సమయంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని, జూన్ 8వ తేదీన ముస్లిం సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నామని తెలిపారు. పైగా వీళ్లు కోర్టులో మరో వాదన కూడా వినిపించారు.
15 ఏళ్లకే మెజార్టీ వచ్చేసినట్టు..
ముస్లిం చట్టం ప్రకారం శారీరక మార్పులు వచ్చిన నాటి నుంచే వాళ్లు మేజర్ అయినట్టుగా గుర్తిస్తారని, ఇలా చూస్తే 15ఏళ్లకే తాము మెజార్టీ సాధించామని వాదించారు. ఓ ముస్లిం అబ్బాయైనా, అమ్మాయైనా మేజర్ అయ్యాక తమ ఇష్టప్రకారం, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. గార్డియన్లకు ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు లేదని కూడా వాదించారు. తమకు ప్రాణహాని ఉందని పఠాన్‌కోట్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్-SSPని ఆశ్రయించింది ఈ జంట. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
ముస్లిం పర్సనల్ లా ఏం చెబుతోంది..?
తీర్పునిచ్చే సమయంలో జస్టిస్ జస్జిత్ సింగ్ బేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పర్సనల్ లా లో ఓ బాలిక ఏ వయసులో పెళ్లి చేసుకోవచ్చో స్పష్టంగా ఉందని అన్నారు. సర్ దిన్‌షా ఫర్దున్‌జీ ముల్లా రాసిన "ప్రిన్సిపల్ ఆఫ్ మహమ్మదన్ లా" బుక్‌లోని ఆర్టికల్ 195 ప్రకారం, ఓ బాలికకు 16 ఏళ్లు వచ్చాక వివాహం చేసుకోవచ్చు. అయితే అబ్బాయికి కచ్చితంగా 21 ఏళ్లు నిండాల్సిందే. ప్రస్తుతం ఈ కేస్‌లో ఇద్దరికీ వివాహ వయసు వచ్చింది కనుక వారి పెళ్లిని కాదనే హక్కులేదని స్పష్టం చేశారు జస్టిస్ బేడీ. గతేడాది ఓ 17 ఏళ్ల ముస్లిం బాలిక 36ఏళ్ల వ్యక్తిని వివాహం చేసుకున్న సమయంలోనూ ముస్లిం పర్సనల్ లా అంశం తెరపైకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఆ వివాహాన్ని అంగీకరించకపోవటం వల్ల ఆ జంట హైకోర్టుని ఆశ్రయించింది. అప్పుడు కూడా ధర్మాసనం...బాలికకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ముస్లిం చట్టాల ప్రకారం ఆ బాలిక వివాహానికి అర్హత సాధించిందని స్పష్టం చేసింది.