MP Nusrat Jahan: సొంత ఇళ్లు కట్టిస్తామని చెబుతూ.. ప్రజలను మోసం చేశారని తృణమూల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్ పై కేసు నమోదు అయింది. మొత్తం 429 మంది వద్ద నుంచి ఇల్లు కట్టిస్తామని దాదాపు రూ.28 కోట్ల మేర మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు దీనిపై గరియాహట్ పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు ఆమెపై అలిపోర్ కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. అయితే ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్ ను సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కూడా మౌనం వహిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


నుస్రత్ జహాన్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ.5.55 లక్షలకు త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. అలాగే వీటిని 2018లోగా కొనుగోలు దారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయిచారు. 


మరోవైపు ఈడీకి ఫిర్యాదు చేసిన శంకుదేవ్ పాండా


బీజేపీ నేత సంకూ దేబ్  పాండా ఇటీవల నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. 20 కోట్ల రూపాయలకు పైగా నుస్రత్ మోసం చేసిందని ఆరోపించారు. 429 మంది నుంచి 5 లక్షల 55 వేల రూపాయలు తీసుకున్న నుస్రత్ సంస్థ.. బదులుగా ఫ్లాట్ ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. కానీ, డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులకు ఆ ఫ్లాట్ లభించలేదని ఆరోపించారు. ఫిర్యాదుదారులు సెవెన్ సెన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డబ్బు ఇచ్చారని ఆరోపించారు. ఆ సంస్థకు నుస్రత్ నాయకురాలు. ఈ ఘటనపై ఈడీకి ఫిర్యాదు చేశారు. నుస్రత్‌పై వచ్చిన మోసంపై ఈడీ విచారణ జరిపించాలని బీజేపీ నేత శంకుదేవ్ పాండా డిమాండ్ చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ప్రయోజనం లేకపోవడంతో ఈడీని ఆశ్రయించాను అని బీజేపీ నేత పేర్కొన్నారు. ఈ విషయమై నుస్రత్‌ జహాన్‌ను సంప్రదించగా, ఫోన్‌లో స్పందన లేదు.


మరోవైపు ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించడానికి నుస్రత్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఫిర్యాదును కేంద్ర ఏజెన్సీకి నివేదించినట్లు పేర్కొంటున్నందున, న్యాయవాదులతో మాట్లాడిన తర్వాతే ఫిర్యాదుపై నుస్రత్ జహాన్ స్పందిస్తారని సమాచారం.