Mother made her son hang or saree : ఆధునిక సమాజంలో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రాణాల కంటే వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలకు అద్దం పట్టేలా ఒక దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం కింద పడిపోయిన బట్టల కోసం ఒక తల్లి తన చిన్నారి కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.                                 

Continues below advertisement

ఎనిమిదో అంతస్తులో నివసిస్తున్న ఒక మహిళకు సంబంధించిన బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు ఏడో అంతస్తులోని బాల్కనీ షేడ్ మీద పడిపోయాయి. వాటిని తీసుకురావడానికి సదరు మహిళ తన కుమారుడిని ఒక చీర సహాయంతో కిందికి వేలాడదీసింది. ఎనిమిదో అంతస్తు నుండి ఏడో అంతస్తు వరకు ఆ చిన్నారిని చీరతో కట్టి కిందికి దించి, పడిపోయిన బట్టలను తీసుకున్న తర్వాత మళ్ళీ పైకి లాగింది. 

ఈ ప్రమాదకరమైన దృశ్యాన్ని ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్ వాసులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆ తల్లి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ బాలుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి, కేవలం కొన్ని బట్టల కోసం ఇంతటి సాహసానికి ఎలా ఒడిగట్టారు  అంటూ అనేకమంది సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు. ఆ సమయంలో చీర పట్టు తప్పినా లేదా చిన్నారి భయంతో చేయి వదిలేసినా కోలుకోలేని నష్టం జరిగేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

ఈ సంఘటనపై స్థానిక అపార్ట్‌మెంట్ అసోసియేషన్ తో పాటు పోలీసులు కూడా స్పందించినట్లు తెలుస్తోంది. సదరు మహిళకు నోటీసులు జారీ చేసి, ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు పునరావృతం కాకుండా హెచ్చరించారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలని ఈ ఘటన మరొకసారి గుర్తు చేస్తోంది.