Most wanted terrorist Tahawwur rana: తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు డిపోర్టేషన్ చేస్తున్నారు. ఆయనను తీసుకు వస్తున్న కారణంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో కేంద్రంలోని పెద్దలు ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. తహవూర్ రాణా ఎప్పుడూ గతంలో ఇండియాకు రాలేదు కానీ భారత్ లో సృష్టించిన మారణహోమానికి ప్రధాన కారకుడు.

ముంబై ఉగ్రదాడుల వెనుక తహవూర్ రాణా !

భారత్ ను వణికించిన ముంబై ఉగ్రదాడుల వెనుక తహవూర్ రాణా కీలక పాత్రధారి. ముంబై దాడుల మాస్టర్‌మైండ్‌ డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ . ఉగ్రదాడుల కోసం హెడ్లీకి పూర్తి స్తాయిలో ఆర్థిక సాయం చేసిన వ్యక్తి తహవూర్ హుస్సేన్ రాణా. ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.  పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, లష్కరే తొయిబాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.  ముంబై దాడుల కేసుల్లో  పోలీసులు రూపొందించిన 405 పేజీల ఛార్జిషీట్‌లోనూ తహవూర్ రాణా పేరుంది. మారణాయుధాలను కొనుగోలు చేయడానికి, వాటిని చేరవేయడానికీ పూర్తి సహకారాన్ని ఇచ్చాడు. రాణా ఆర్థిక సాయం చేయడం మాత్రమే కాదు..మొత్తం ఉగ్రదాడులకు బ్లూప్రింట్ కూడా రెడీ చేసినట్లుగా  అభియోగాలు ఉన్నాయి. 

దేశాన్ని వణికించిన ముంబై దాడులు

2008 నవంబర్ 26వ తేదీన ముంబైపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.   తాజ్‌మహల్ హోటల్, ఓబెరాయ్ ట్రైడెంట్ హోటల్, కామా ఆసుపత్రి, ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, నారీమన్ హౌస్, మెట్రో సినిమా, లెపార్డ్ కేఫ్..వంటి ప్రాంతాలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఎదురుగా వచ్చిన వారందర్నీ కాల్చి చంపేశారు.  ఏకే 47 రైఫిళ్లు, ఆర్డీఎక్స్, ఐఈడీ, గ్రెనేడ్లు.. ఇలా మారణాయుధాలతో నరమేధాన్ని సృష్టించారు. బాంబింగ్, మాస్ షూటింగ్‌కు పాల్పడ్డారు. ఉగ్రవాదులు జరిపిన దాడులు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ దాడుల్లో 166 మంది మరణించారు. 

అమెరికాలో దాక్కున్న తహవూర్ రాణా 

ముంబై ఉగ్రదాడుల కేసులో  టెర్రరిస్ట్ తహవూర్‌ రాణాను భారత కోర్టులు దోషిగా తేల్చాయి.  కానీ శిక్ష ఖరారు చేయలేదు. తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు.  టెర్రరిస్ట్ తహవూర్ రాణా ప్రస్తుతం అమెరికాలోని లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో ఉన్నాడు.  ముంబై దాడులు జరిగిన కొన్ని నెలలకు చికాగో అధికారులు టెర్రరిస్ట్ తహవూర్ రాణాను అదుపులోకి తీసుకున్నారు.  అతనిపై అమెరికాలో తప్పుడు పాస్ పోర్టు, వీసా కేసులు.. ఇతర నేర పూరిత కార్యకలాపాల్లో పాల్గొన్నట్లుగా కేసులు ఉన్నాయి.  2013లో  అతనికి ఫద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష. విధించారు. ముంబై దాడుల వ్యవహారంలో  ఉగ్రదాడులకు దిగి ప్రత్యక్షంగా దొరికిన కసబ్‌కు ఉరి శిక్ష విధించారు. ఇప్పుడు తహవూర్ రాణాను కూడా ఇండియాకు తీసుకు వచ్చి ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.  

 

మోదీ చొరవతో ఇండియాకు అప్పగింత

తహవూర్ రాణా  అమెరికాలో తలదాచుకుంటూ ఉండటంతో ముంబై దాడుల్లో దోషిగా తేలిన  అత్యంత ప్రమాదకర వ్యక్తిని భారత్‌కు అప్పగించాలని చాలా కాలంగా మన దేశం డిమాండ్ చేస్తూ వస్తోంది.  భారత ప్రభుత్వం ఫెడరల్ కోర్టును గతంలోనే ఆశ్రయించింది. కానీ గతంలో కోర్టు భారత్ అభ్యర్థనను తోసి పుచ్చింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు రాగానే, ట్రంప్ భారత్‌కు అనుకూల నిర్ణయాన్ని తీసుకున్నారు.  దీన్ని సవాల్ చేస్తూ అతను అమెరికా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు రాణా. చట్టవిరుద్ధంగా తనను రప్పించడానికి భారత్ ప్రయత్నాలు సాగిస్తోందంటూ పిటీషన్ దాఖలు చేశాడు.దాన్ని కూడా కోర్టు తోసిపుచ్చింది. దాంతో ఇండియాకు తీసుకు వస్తున్నారు. ఆయనకు విధించబోయే శిక్షఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరం.