ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం ధాటికి దేశం అతలాకుతలమైంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. అయితే మొరాకోలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మారకేష్‌ వద్ద భూకంపం సంభవించడంతో తీవ్రత మరీ ఎక్కువైంది. ఇప్పటికి 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. పెద్ద సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. గ్రామాలు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు చేపడుతూ శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీస్తుంటే మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 


ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రదేశమైన మారకేష్‌ నగరానికి దక్షిణంలో సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్‌ పర్వత ప్రాంతాన్ని భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి 11  గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు చుట్టు ఉన్న సుమారు ఐదు ప్రావిన్సుల ప్రజలను భయాందోళలకు గురిచేసింది. అట్లాస్‌ పర్వతాల్లోని మారుమూల గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రముఖ నగరమైన మారకేష్‌లో 8,40,000 మంది జనాభా ఉన్నట్లు సీఎన్ఎన్‌ ఓ నివేదికలో తెలిపింది.


వేలాది మంది ప్రజలు శుక్రవారం రాత్రి భయంతో బయటకు పరుగులు తీశారు. అంతా ఆరుబయటే రాత్రంతా గడిపారు. మారకేష్‌లోని చారిత్రక కట్టడాలు కూడా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాలు ప్రజలు అరుపులు, కేకలతో దద్దరిల్యాయి. మరణించిన వారిని శిథిలాల నుంచి బయటకు తీస్తుంటే పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. ప్రజలు రోదనలు వర్ణణాతీతం. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో విద్యుత్‌ లేక, రహదారులు ధ్వంసమయ్యి, అంబులెన్సులు కూడా వెళ్లలేక పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ప్రజలు తమ వాళ్ల కోసం వెతుకుతూ , రోదనలతో పరుగులు పెడుతుంటే పరిస్థితి భయానకంగా మారింది.


అక్కడి ప్రముఖ మసీదు కటూబియాకు ఈ భూకంపం కారణంగా తీవ్ర నష్టం జరిగింది. అది 12వ శతాబ్దం నాటి చారిత్రక కట్టడం. 69 మీటర్ల ఎత్తైన మినార్‌ భూకంపం సమయంలో ఊగుతూ కనిపించిందని స్థానికులు తెలిపారు. అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం మారకేష్‌ ప్రాంతంలో గత 120 ఏళ్లలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపం అని పేర్కొంది. 


తీర ప్రాంత నగరాలైనన రబాత్‌, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా భూకంపం సంభవించింది. అయితే అంత తీవ్ర స్థాయిలో కాదు. తమ దగ్గర అంత నష్టం జరగలేదని, అందరూ అరుపులు కేకల పెట్టడం తాము చూశామని మరాకేశ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సౌయిరా నివాసి మీడియాకు తెలిపారు.  ప్రజలంతా రాత్రి బయటే ఉన్నారని ఇళ్లలోకి వెళ్లలేదని వెల్లడించారు. భూకంపం వచ్చినప్పుడు తాను డ్రైవింగ్ లో ఉన్నానని, వెంటనే వాహనం ఆపేశానని, పరిస్థితి తీవ్రత అర్థమయ్యిందని మరో వ్యక్తి తెలిపారు. నది ఒడ్డు చీలిపోవడం చూశానని చెప్పారు.


1980లో మొరాకో పక్కనే ఉన్న అల్జీరియాలో అతి పెద్ద భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 7.3 మ్యాగ్నిట్యూడ్‌ గా నమోదైంది. ఈ విపత్తులో 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 3 లక్షల మంది ఇళ్లు లేని వారుగా మిగిలిపోయారు. పెద్ద మొత్తంలో ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుత భూకంప ప్రభావం అల్జీరియాలో కూడా కనిపించింది. కాస్త ప్రకంపనలు వచ్చాయి. కానీ ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదు.