Monkeypox in India: 


హైరిస్క్ గ్రూప్‌ల వాళ్లు జాగ్రత్తగా ఉండాలి..


భారత్‌లో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దేశ రాజధానికి దిల్లీలో ఉంటున్న నైజీరియా మహిళకు మంకీపాక్స్‌ సోకిందని వైద్యాధికారులు నిర్ధరించారు. దిల్లీలో ఇది నాలుగో కేసు. దీంతో కలుపుకుని భారత్‌లో మొత్తం బాధితుల సంఖ్య 9 కి పెరిగింది. ఇందులో కేరళకు చెందిన వ్యక్తి ఒకరు ఇటీవలే మరణించారు. మిగిలిన 8 మందిలో నలుగురు కేరళకు చెందిన వారు కాగా, మరో నలుగురు దిల్లీ వాసులు. అయితే...మొత్తం 9 మంది బాధితులను పరిశీలిస్తే ట్రావెల్ రికార్డున్న వాళ్లు ఐదుగురు మాత్రమే. మిగతా నలుగురుకి ఎలాంటి ట్రావెల్ రికార్డ్ లేకపోయినా మంకీపాక్స్‌ సోకటంపైనే అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్థానికంగానూ ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, హైరిస్క్ గ్రూప్‌ల వాళ్లు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వైరస్ కట్టడికి ఇప్పటి వరకూ జారీ చేసిన గైడ్‌లైన్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం పలువురు నిపుణులతో కలిసి సమావేశం  కానుంది. ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ EMR డైరెక్టర్ ఎల్ స్వస్తిచరణ్ దీనికి అధ్యక్షత వహించనున్నారు. మంకీపాక్స్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో చర్చించనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రతినిధి డాక్టర్ పవన మూర్తి కూడా ఈ మీటింగ్‌లో పాల్గొననున్నారు. 


బ్రిటిష్ జర్నల్‌లో ఏముందంటే..? 


బ్రిటిష్ జర్నల్ ఇటీవలే ఓ విషయం వెల్లడించింది. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న మంకీపాక్స్‌ వైరస్ లక్షణాలకు, ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ లక్షణాలకు చాలా తేడా ఉందని తేల్చి చెప్పింది. లండన్‌లో మంకీపాక్స్ సోకిన 197 మంది బాధితుల శాంపిల్స్‌ను పరిశీలించిన తరవాత ఈ విషయం తెలిపింది. వీరిలో కేవలం 25% మంది మాత్రమే మంకీపాక్స్‌ బాధితులతో సన్నిహితంగా ఉన్నట్టు తేలింది. కొందరిలో లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్‌గా నిర్ధరణ అవుతోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వైరస్ కట్టడి చర్యల్లో మార్పులు చేయాలని బ్రిటీష్ జర్నల్ సూచించింది. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్‌..మంకీపాక్స్‌ మేనేజ్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌లో మార్పులు చేసింది. జ్వరం, చెమటలు, తలనొప్పి, దద్దర్లులాంటి లక్షణాలు...మంకీపాక్స్‌ సోకిన 2-4 రోజుల తరవాత కనిపిస్తున్నాయి. ఈ లోగా మరి కొందరికి వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు అనుగుణంగానే భారత్‌లోనూ మంకీపాక్స్‌కు సంబంధించిన మార్గదర్శకాల్లో మార్పులు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. 


Also Read: Hindupur MP Video: గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వైరల్, టీడీపీ వాళ్ళు మార్ఫింగ్ చేశారంటున్న ఎంపీ


Also Read: Rambha Latest Look : రంభ ఇంట్లో ఖుష్బూ - అప్పటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి