Modi refused Trump calls 4 times in recent weeks:  అడ్డగోలు నిర్ణయాలతో చిరాకు తెప్పిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను భారత ప్రధాని మోదీ పట్టించుకోవడం మానేశారు. ఆయన ఫోన్ చేస్తున్నా..  సరే స్పందించడం లేదు.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత కొన్ని వారాల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నాలుగు సార్లు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, మోదీ స్పందించలేదని జర్మనీకి చెందిన ప్రముఖ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ జైటుంగ్ (FAZ) సంచలన కథనం ప్రచురించింది.  భారత్-అమెరికా మధ్య  ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుతో భారత్ ీ విషయంలో అసంతృప్తి ఉందని దీని ద్వారా తెలుస్తోందని ఈ పత్రిక పేర్కొంది.

అమెరికా ఇటీవల భారత్‌పై 50 శాతం ఎగుమతి సుంకాలను విధించింది. బ్రెజిల్ తర్వాత అత్యధికంగా భారత్ పైనే ట్రంప్ సుంకాలు విధించారు.   రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని... దాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోవడంతో సుంకాలు విధించారు. అయితే భారత్ పట్టించుకోవడం మానేసింది. తమకు తమ దేశ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. ఈ కారణంగా  ట్రంప్ మోదీతో మాట్లాడేందుకు నాలుగు సార్లు ప్రయత్నించారు.  కానీ ప్రధాని మోదీ ఫోన్ కాల్స్‌కు స్పందించలేదు. 

ట్రంప్ గతంలో వియత్నాం నాయకుడు జనరల్ సెక్రటరీ టో లామ్‌తో ఒక ఫోన్ కాల్‌లో వాణిజ్య ఒప్పందాన్ని మళ్లీ చర్చించి, అంగీకారం లేకుండానే సోషల్ మీడియాలో ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. ట్రంప్ ఇలాంటి గేమ్స్ ఆడుతూంటారు. అందుకే  "మోదీ ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవడానికి ఇష్టపడలేదు" అని జర్మన్ పత్రిక తెలిపింది.  ట్రంప్ ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణలో తానే శాంతి ఒప్పందాన్ని కుదుర్చానని పదే పదే చెప్పుకుంటున్నారు. దీన్ని భారత్ ఖండిస్తోంది.  అంతేకాక, ట్రంప్ పాకిస్తాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్నారు.  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఓవల్ ఆఫీస్‌లో విందు కోసం ఆహ్వానించడం, భారత్ లో రాయబారిగా వివాదాస్పద వ్యక్తిని నియమిచడం అన్నీ భారత్ కు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే. అందుకే భారత్  అమెరికా విషయంలో పట్టించుకోనట్లుగా ఉంటోంది. 

 

అమెరికా వైఖరితో విసిగిపోయిన ప్రధాని  మోదీ చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నారని  అంతర్జాతీయ మీడియా చెబుతోంది. గత సంవత్సరం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశం తర్వాత ..ఈ వారం చివరలో మోదీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్‌లో పాల్గొనడానికి చైనాలోని టియాంజిన్‌కు వెళ్లనున్నారు.  భారత్‌లో ట్రంప్ కుటుంబ వ్యాపారం కూడా వివాదాస్పదంగా మారింది.  ట్రంప్  ఒత్తిడి విధానాలు ఇతర దేశాలపై పనిచేసినప్పటికీ, భారత్ విషయంలో విఫలమయ్యాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.