Modi gets emotional while addressing Bihar voters: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బీహార్ ప్రజలతో ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న సమయంలో ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన దివంగత తల్లి హీరాబెన్ మోదీపై బీహార్‌లోని RJD-కాంగ్రెస్ ర్యాలీ వేదిక నుంచి  ఓ కార్యకర్త దూషించారు. ఆ ఘటనపై మోదీ తీవ్ర భావోద్వేగంతో స్పందించారు. ఈ అవమానం కేవలం తన తల్లికి మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు జరిగిన అవమానమని ఆయన అన్నారు.  

ఆగస్టు 28, 2025న దర్భంగాలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని ‘వోటర్ అధికార్ యాత్ర’ జరిగింది. ఆ యాత్రలో పాల్గొన్న కొంత మంది  ప్రధాని మోదీ , ఆయన తల్లిపై అసభ్యకర భాష ఉపయోగించారు.ఈ  వీడియో వైరల్ అయింది. ఈ ఘటనలో మహ్మద్ రిజ్వీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశీ పర్యటన నుంచి వచ్చిన మోదీ   బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారీ సంఘ్ ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి  తన తల్లికి జరిగిన  అవమానం తనకు,  బీహార్ ప్రజలకు తీవ్ర బాధ కలిగించిందని తెలిపారు. 

 బీజేపీ నాయకులు మోదీ తల్లిని అవమానించడాన్ని   “రాజకీయ సంస్కృతికి అవమానం”గా  చెబుతున్నారు.  అమిత్ షా రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ , RJD ఈ ఆరోపణలను ఖండించాయి, రాహుల్ గాంధీ లేదా తేజస్వీ యాదవ్  కు ఈ వీడియోతో సంబంధం లేదన్నారు.  నౌషాద్ అనే స్థానిక నాయకుడు జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పారు.   

తన తల్లిపై చేసిన వ్యాఖ్యలు  మహిళల గౌరవానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ ఘటన బీహార్ ఎన్నికలలో మహిళా ఓటర్లను ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. తమ ర్యాలీలో తమ పార్టీ కార్యకర్త మోదీ తల్లిని దూషించడంతో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు.