Kamal Hasan on EVMs: లోక్‌సభ ఎన్నికల ముందు సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ EVMలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎమ్‌లను తప్పుబట్టడం సరికాదంటూనే సెటైర్లు వేశారు. కార్‌లో వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగితే అది డ్రైవర్ తప్పు అవుతుంది కానీ..కార్‌ తప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈవీఎమ్‌ల గురించి మాట్లాడడం మానేయాలని, ఎన్నికల తరవాతే వాటి సంగతి చూడడం మంచిదని అన్నారు కమల్. అవి ఎంత బాగా పని చేస్తున్నాయో పరీక్షించాల్సిన అవసరముందని వెల్లడించారు. అవి ఎంత పవిత్రమైనవో తెలుసుకోవాలనుందని ఎద్దేవా చేశారు. వాళ్ల దేవుడైన (బీజేపీని ఉద్దేశిస్తూ) రాముడు కూడా సీతకి అగ్నిపరీక్ష చేశాడని, ఈవీఎమ్‌లు కూడా ఎంత పవిత్రంగా ఉన్నాయో పరీక్షించాలని అన్నారు. 


"మనం అనవసరంగా ఈవీఎమ్‌లను తప్పుబట్టొద్దు. కార్‌లో వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదం జరిగిందని అనుకుందాం. అప్పుడు డ్రైవర్‌దే తప్పు అంటాం కానీ కార్‌ది తప్పు అనగలమా..? ఈ ఎన్నికలు జరిగిన తరవాతే ఈవీఎమ్‌ల పని తీరు గురించి ఆలోచిద్దాం. అప్పుడే మాట్లాడుకుందాం. అసలు అవి ఎలా పని చేయాలో ప్రజలే చెప్పాలి. వాళ్ల దేవుడైన రాముడు కూడా అగ్నిపరీక్ష చేశాడుగా. అదే విధంగా మనం ఈవీఎమ్‌లను పరీక్షిద్దాం. నేనేమీ జోక్ చేయడం లేదు"


- కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం చీఫ్