Revanth Reddy Cabinet Desicions: తెలంగాణ కేబినెట్ సమావేశంలో (Telangana Cabinet Desicions) తీసుకున్న నిర్ణయాలు, చర్చించిన అంశాల గురించి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వివరించారు. తాము ఎన్నికలకు ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం ఈ మొదటి కేబినెట్ సమావేశంలో చర్చించామని వివరించారు. అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రతి గ్యారంటీ విషయంలో సుదీర్ఘంగా చర్చించామని అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ మొదటి కేబినెట్‌లో రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. రేపు మళ్లీ ఈ రెండు గ్యారంటీలపై సుదీర్ఘంగా ఆయా విభాగాల ఉన్నతాధికారులతో చర్చించి డిసెంబరు 9న వాటిని మొదలు పెడతామని (Minister Sridhar Babu Press Meet) అన్నారు.
అమలు చేయబోయే రెండు గ్యారంటీలు
మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా పది లక్షల వరకూ పెంపు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని నిర్ణయించామని శ్రీధర్ బాబు వివరించారు. డిసెంబర్ 9 నుంచి వీటిని అమలు చేస్తామని అన్నారు. ఆధార్ కార్డు లేదా, ఏదైనా గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు. సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 9 నుంచి ఈ రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లుగా శ్రీధర్ బాబు తెలిపారు.
రేపు విద్యుత్ రంగంపై సీఎం రేవంత్ సమీక్ష (CM Revanth Review Meet)
విద్యుత్ అంశంపై ఉన్న గ్యారంటీలో భాగంగా కోతలు లేని విద్యుత్ సరఫరా కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. 2014లో ఇప్పటిదాకా విద్యుత్ రంగంలో అనేక తప్పులతడకలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశాలపై కూడా చర్చించామని అన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో సమావేశమై సమీక్ష జరుపుతారని అన్నారు. దీంట్లో కరెంటు రంగానికి సంబంధించి అనేక అంశాలు చర్చిస్తారని చెప్పారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం - మంత్రి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను కోరినట్లుగా శ్రీధర్ బాబు చెప్పారు. 2014 నుంచి 2023, డిసెంబర్ 7 వరకూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రకటించారు. రేపు విద్యుత్ శాఖపై ఉన్నతాధికారులతో రేవంత్ సమీక్ష చేస్తారని చెప్పారు.
Telangana Assembly ఎల్లుండి అసెంబ్లీ
డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశం ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఆరోజు ప్రొటెం స్పీకర్ ఎన్నిక ఉంటుందని, సభలో సీనియర్ సభ్యుడైన వ్యక్తిని ప్రోటెం స్పీకర్ గా ఎన్నుకుంటారని చెప్పారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అదే రోజు ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. నేడు (డిసెంబర్ 7) ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల్లో ఎవరికి ఏ శాఖలు కేటాయించారో ఇంకా స్పష్టత లేదని, మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పష్టం చేశారు.