Sikkim Milk Tanker Accident: సిక్కిమ్‌లో ఓ మిల్క్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. రాణిపూల్‌ వద్ద ఓ ఫెయిర్ జరుగుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పి అక్కడి వాళ్లపై దూసుకొచ్చింది. అక్కడే పార్క్ చేసి ఉన్న కార్‌లను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కనీసం 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. అక్కడి CC కెమెరాలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. వాహనాల కింద నలిగిపోయిన వాళ్లకి స్థానికులు సాయం అందించి హాస్పిటల్‌కి తరలించారు. అయితే..ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మిల్క్ ట్యాంకర్‌ బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఫెయిర్‌లో తంబోలా గేమ్ జరుగుతుండగా ఒక్కసారిగా కార్లు తమపైకి దూసుకురావడాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఆ వాహనాల కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 


"సాయంత్రం 7.30 సమయంలో ఫెయిర్‌లో తంబోలా ప్రోగ్రామ్ జరుగుతుంది. అప్పుడే ఈ ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందారు. 20 మందికి చికిత్స అందిస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వాళ్లకి వైద్య ఖర్చులూ ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ప్రమాదంపై విచారణ చేపడుతున్నాం"


- అధికారులు