Divya Putri Sheena Rani: భారత్ ఇటీవలే మిషన్ దివ్యాస్త్రలో భాగంగా అగ్ని-5 మిజైల్‌ని విజయవంతంగా పరీక్షించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ DRDO శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. Multiple Independently Targetable Re-entry Vehicle (MIRV) టెక్నాలజీతో దీన్ని తయారు చేశారు. అయితే..ఈ మిజైల్ సిస్టమ్‌ని తయారు చేయడంలో మహిళలే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా R షీనా రాణి పేరు ఎక్కువగా వినబడుతోంది. ఆమెకి Divya Putri అనే బిరుదు కూడా ఇచ్చేశారు. 57 ఏళ్ల షీనా రాణి మిజైల్స్ సిస్టమ్స్ తయారు చేయడంలో నిపుణురాలు. హైదరాబాద్‌లోని  Advanced Systems Laboratory (ASL)లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 1999లో DRDO చేరారు. అప్పటికే భారత్‌ Pokhran-II అణుపరీక్షల్ని పూర్తి చేసింది. అప్పటి నుంచి Agni missile program లో భాగస్వామిగా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఆమె 2012 నాటి Agni-5 మిజైల్ టెస్ట్‌ని గుర్తు చేసుకున్నారు. లాంఛింగ్‌కి అంతా సిద్ధం చేసుకున్నప్పటి నుంచే ఎంతో ఆందోళన చెందినట్టు వివరించారు. ఇప్పుడు మరోసారి టెస్ట్ చేసి విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. 


అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో..


తిరువనంతపురంలో జన్మించిన షీనా రాణి పదో తరగతిలోనే తండ్రిని కోల్పోయారు. ఆ తరవాత అమ్మే అంతా తానై పెంచారు. తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు అమ్మే కారణం అని చాలా గర్వంగా చెబుతారు షీనా రాణి. College of Engineering Trivandrum (CET)  లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తరవాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో 8 ఏళ్ల పాటు పని చేశారు. అక్కడి నుంచి DRDOకి వెళ్లారు. అప్పటి నుంచి అగ్ని-5 మిజైల్‌పై నిత్యం శ్రమించారు. కేవలం సరిహద్దుల్ని రక్షించుకోడానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత రక్షణ రంగం సామర్థ్యం ఏంటో తెలియజెప్పేలా ఈ మిజైల్ ఉండాలని కలలుగన్నారు షీనా రాణి. వ్యూహాత్మకంగా భారత్‌ని ముందుంచాలన్న పట్టుదలతో  MIRV technologyని డెవలప్ చేశారు. ఒకే ఒక్క మిజైల్‌తో పలు వార్‌హెడ్స్‌ని ధ్వంసం చేయగల సామర్థ్యంతో ఈ టెక్నాలజీని రూపొందించారు. భారత దేశ మిజైల్‌ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో తన కెరీర్‌ని ప్రారంభించారు షీనా రాణి. మిజైల్ టెక్నాలజిస్ట్ డాక్టర్ అవినాశ్ చందర్‌ శిష్యరికం చేశారు. ఆమె భర్త PSRS శాస్త్రి కూడా DRDOలోనే మిజైల్స్ టెక్నాలజీపైనే పని చేశారు. మొదటి నుంచి ఆమెకి ప్రోత్సాహాన్నిచ్చారు. MIRV టెక్నాలజీతో అగ్ని-5 క్షిపణిని తయారు చేసి విజయంవంతంగా పరీక్షించడం వల్ల ఈ సాంకేతికత ఉన్న దేశాల సరసన నిలబడింది భారత్. ప్రస్తుతానికి అమెరికా,యూకే, రష్యా, ఫ్రాన్స్ వద్దే ఈ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఈ జాబితాలోకి భారత్ కూడా వచ్చి చేరింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ మిజైల్‌ని తయారు చేసుకోవడం చాలా గొప్ప విషయం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు.