Massive fire broke out at Tiger Tower: దుబాయ్ 67 అంతస్తుల టైగర్ టవర్ రెసిడెన్షియల్ స్కైస్క్రాపర్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దుబాయ్ కాలమానం ప్రకారం ప్రకారం తొమ్మిదిన్నరకు మంటలు ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదం సుమారు 60వ అంతస్తు లేదా అంతకంటే ఎక్కువ ప్రారంభమై, అనేక అంతస్తులకు వ్యాపించింది. సుమారు 3,820 మంది నివాసితులు 764 అపార్ట్‌మెంట్ల నుండి బయటకు వచ్చారు. ఇప్పటి వరకూ ప్రాణనష్టం జరిగినట్లుగా సమాచారం లేదు.
కొంతమంది నివాసితులు ఫైర్ అలారంలు పని చేయలేదని, పొగ వాసన , స్నేహితుల నుండి కాల్స్ ద్వారా మాత్రమే అగ్ని ప్రమాదం గురించి తెలిసిందని ఫిర్యాదు చేశారు. మెట్లమార్గాలు దట్టమైన పొగతో నిండిపోవడంతో కొందరు ఎలివేటర్లను ఉపయోగించి బయటకు వచ్చారు. ఇది మరీనా పినాకిల్‌లో మొదటి అగ్ని ప్రమాదం కాదు. 2015 మే 25న, 47వ అంతస్తులోని ఒక అపార్ట్‌మెంట్ కిచెన్‌లో ప్రమాదం కారణంగా అగ్ని సంభవించి, 48వ అంతస్తుకు వ్యాపించింది. ఈ భవనం సమీపంలోని ది టార్చ్ టవర్‌లో కూడా 2015 , 2017లో అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
అగ్నిప్రమాదం గురించి తెలియగానే దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు రంగంలోకి దిగాయి. ఫైర్ ట్రక్కులు ,అంబులెన్స్‌లు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు మంటల్ని అదుపు చేయడానికి కృషి చేశాయి. భవన డెవలపర్‌తో సమన్వయం చేసి, నివాసితుల కోసం తాత్కాలిక ఆశ్రయ ఏర్పాట్లు చేశారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా ట్రామ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం, అగ్ని ప్రమాదం కారణంగా దుబాయ్ మరీనా స్టేషన్ , పామ్ జుమైరా స్టేషన్ మధ్య ట్రామ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.
సమీపంలోని MAG 218 భవన నివాసితులు కూడా పొగ కారణంగా ఇబ్బందిపడ్డారు. కొందరు తాత్కాలికంగా ఖాళీ చేయవలసి వచ్చింది. అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. 2015 , 2017లో ది టార్చ్ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదాలకు భవనాలపై ఉపయోగించిన ఫ్లామబుల్ క్లాడింగ్ ఒక కారణంగా గుర్తించారు. నివాసితులు, సాక్షులు సోషల్ మీడియాలో వీడియోలు , ఫోటోలను షేర్ చేశారు .