Manipur Violence:



ఆ నిర్ణయంపై నిరసనలు..


మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడంలేదు. కొద్ది రోజులుగా అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మెజార్టీ కమ్యూనిటీ అయిన మైతై (Meitei) వర్గాన్ని షెడ్యూల్‌ ట్రైబ్‌లలో చేర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కూడా దీనికి అంగీకరించింది. దీనిపై ఒక్కసారిగా మైతై వర్గ ప్రజలు భగ్గుమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల అల్లర్లకు దిగారు. అర్ధరాత్రి హింస చెలరేగడం వల్ల పోలీసులు అలెర్ట్ అయ్యారు. దాదాపు 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్, చురచంద్‌పూర్, కంగ్‌పొక్పి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మణిపూర్ ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయింది. ఇంటర్నెట్ సర్వీస్‌లను బంద్ చేసింది. ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్ కూడా రాష్ట్రంలో మొహరించాయి. ఎలాంటి హింస చెలరేగకుండా నిఘా పెడుతున్నాయి. ఇప్పటికే ఫ్లాగ్ మార్చ్ కూడా నిర్వహించాయి. దాదాపు 7,500 మంది పౌరులకు ఆర్మీ షెల్టర్ ఇచ్చింది. కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలకు తరలించారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


"ఇండియన్ ఆర్మీతో పాటు అసోం రైఫిల్స్ బలగాలూ రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆర్మీ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. మణిపూర్ ప్రజల భద్రతకు ఆర్మీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకే ఈ బలగాలు మొహరించాయి"


- ఇండియన్ ఆర్మీ 






మేరీ కోమ్ ఆవేదన..


అయితే...అటు ట్రైబల్స్ మాత్రం ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. All Tribal Student Union Manipur ఇప్పటికే మార్చ్ నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంది. చురచంద్‌పూర్‌లో ఈ ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం వేలాది మంది గిరిజనులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టనున్నారు. ఈ సమయంలో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింస చెలరేగే ప్రమాదముందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందుకే ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు భద్రత పెంచాయి. బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ రాష్ట్రంలోని పరిస్థితులపై ట్వీట్ చేశారు. "నా మణిపూర్ ఇలా మంటల్లో తగలబడిపోతోంది. దయచేసి ఆదుకోండి" అంటూ పోస్ట్ చేశారు. మణిపూర్‌లో దాదాపు 53% ప్రజలు మైతై వర్గానికి చెందిన వాళ్లే. మయన్మార్, బంగ్లాదేశ్‌ నుంచి వలస వస్తున్న వారితో ఇప్పటికే సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరంతా. అయితే ప్రస్తుత చట్టం ప్రకారం...మైతై వర్గ ప్రజలు రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో నివసించేందుకు అనుమతి లేదు. దీనిపైనే ఆ వర్గం భగ్గుమంటోంది. అంతకు ముందు సీఎం కార్యక్రమం జరగాల్సి ఉన్నా...ఆ సభను ధ్వంసం చేశారు. ఈ హింసపై అమిత్‌ షా.. సీఎం బీరేన్‌ సింగ్‌తో మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రం గమనిస్తోందని వెల్లడించారు.