మిజోరం (Mizoram ) ముఖ్యమంత్రి లాల్‌దుహోమా (Lalduhoma)పై మణిపుర్ (Manipur) సీఎం బీరేన్ సింగ్ ( Biren Singh) ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర వ్యవహారాల్లో తలదూర్చవద్దని, హద్దులు దాటి ప్రవర్తించవద్దని హెచ్చరించారు. తన పరిధిలో లేని అంశాలపై అభిప్రాయాలు చెప్పడం మానుకోవాలని లాల్‌దుహోమాకు సూచించారు. కుదిరితే రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు వీలైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. లాల్‌దుహోమా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై...నుపి లాన్‌ను స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీరేన్ సింగ్ మాట్లాడారు.
మయన్మార్ సరిహద్దులోని కుకీ-జో ప్రజలను మణిపుర్ పోలీసులు వేధించవద్దని లాల్‌దుహోమా కామెంట్ చేశారు. మోరెలో పలు జాతుల ప్రజలు నివాసముంటున్నారన్న బీరేన్ సింగ్, అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా లాల్‌దుహోమా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మోరెలో తమ ప్రజలను వేధించకూడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్నారు. లాల్‌దుహోమా రాజ్యాంగ పరిధికి మించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైతే మణిపుర్‌లో తిరిగి శాంతి నెలకొల్పేందుకు సహకరించాలని...లేదంటే సైలెంట్‌గా ఉండిపోవాలని సూచించారు. గతంలో మిజోరంలో బ్రూ తెగల మధ్య జరిగిన వివాదంలో...తాము జోక్యం చేసుకోలేదన్నారు. మణిపుర్‌లో ఏం జరిగినా అది తమ అంతర్గత వ్యవహారమని హెచ్చరించారు.
మిజోరంలో జోరం థంగా తర్వాత అధికారంకి వచ్చిన లాల్‌దుహోమా... మణిపుర్‌లోని కుకీ-జో ప్రజల సమస్యలపై చురుగ్గా స్పందిస్తారనే పేరు సంపాదించుకున్నారు. ఆయన జో ప్రజల పునరేకీకరణ కోసం పని చేస్తున్నారు. మణిపుర్‌లోని కుకీ-జో ప్రజలు, మిజోరాంలోని స్థానికుల్లో అత్యధిక మంది జో గ్రూపునకు మద్దతు ఇస్తున్నారు. మయన్మార్‌లో యుద్ధం కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన ప్రజలకు...తమ ప్రభుత్వం శిబిరాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు లాల్‌దుహోమా.