కోట్ల ప్యాకేజీ ఉన్న ఉద్యోగానికి రాజీనామా


నైన్ టూ ఫైవ్ ఉద్యోగాలు చాలా మందికి నచ్చటం లేదు. జాబ్స్‌లోనూ కొత్తదనం కోరుకుంటోంది ఈ తరం. తక్కువ కష్టపడాలి ఎక్కువ సంపాదించాలి అనే సూత్రాన్ని ఫాలో అయిపోతున్నారు. ఒకవేళ ఏదైనా జాబ్‌లో చేరినా నచ్చకపోతే నిర్మొహమాటంగా బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే "బోర్ కొట్టేసింది" అని సమాధానమిస్తున్నారు. మంచి ప్యాకేజ్‌లు వదులుకుని ఏం చేస్తావ్‌రా అని ఇంట్లో వాళ్లు పోరు పెడుతున్నా పట్టించుకోవటం లేదు. లక్షల ప్యాకేజ్ అంటే సరే. మరి కోట్లలో ప్యాకేజ్ ఉన్న వాళ్లు బోర్ కొట్టిందని జాబ్ మానేస్తే 
అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది..? "ఏమైనా పిచ్చా, ఎందుకిలా చేశావ్" అని ఒకరి తరవాత ఒకరు మీద పడిపోతారు. ఇప్పుడు అమెరికాకు చెందిన మెకైల్ లిన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. 


జాబ్ బోర్ కొట్టేసింది: మైకేల్ లిన్


నెట్‌ఫ్లిక్స్‌లో మైకేల్ లిన్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఉద్యోగం మానేశాడు. ప్రస్తుతం తన జీతం ఏడాదికి మూడున్నర కోట్లు. ఇది కాకుండా రోజూ ఫ్రీగా ఫుడ్‌ ఆఫర్ చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. అయినా ఇవేమీ లిన్‌కి నచ్చలేదట. అందుకే వెంటనే రిజైన్ చేసేశాడు. మరి ఎందుకిలా చేయాల్సి వచ్చిందని అడిగితే "కరోనా ముందు వరకూ కంపెనీ ఇచ్చిన బెన్‌ఫిట్స్‌ని బాగానే ఉన్నాయని, తరవాత పని తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది" అని అంటున్నాడు మైకేల్ లిన్. అంత పెద్ద జీతం ఉన్న ఉద్యోగం వదిలేసినందుకు తల్లిదండ్రులు కాస్త గట్టిగానే తిట్టారని చెబుతున్నాడు లిన్. తన మెంటార్‌ కూడా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారని చెప్పాడు మైకేల్. మరో ఉద్యోగమేదైనా లైనప్‌లో పెట్టుకుని అప్పుడు ఈ జాబ్ వదిలేయాల్సింది అని సలహా ఇచ్చాడట. కానీ మైకేల్ మాత్రం ఈ మాటలేమీ పట్టించుకోలేదు. వృత్తి పరంగా సంస్థలో సంతృప్తిగా లేనప్పుడు ఎంత ప్యాకేజీ ఇస్తే మాత్రం ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి వెళ్లాలన్నది తన కల అని, నెట్‌ఫ్లిక్స్‌ సంస్థలో ప్రస్తుతానికి ఆ అవకాశాలు కనిపించటం లేదని తెగేసి చెబుతున్నాడు లిన్. ఉద్యోగంలో చేరిన కొత్తలో రోజూ ఏదో కొత్త అంశం నేర్చుకునేవాడినని, రానురాను పని ఒత్తిడి పెరిగి మిగతా విషయాలు నేర్చుకోవటానికి సమయం సరిపోవటం లేదని అంటున్నాడు. కొన్ని రోజులకు ఉద్యోగం చేయాలనే ఉత్సాహం పోయిందని, అది తన పర్‌ఫార్మెన్స్‌పై ప్రభావం చూపిందని చెప్పాడు. "ఉద్యోగం ఊడిపోకుండా ఉండాలంటే ఇంకా కష్టపడక తప్పదు" అని పై వాళ్లు వార్నింగ్ ఇచ్చాకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నాడు మైకేల్ లిన్. కారణమేదైనా అన్ని కోట్ల ప్యాకేజీని వదులుకోవటం అంటే మాటలా..?