వేటాడే వాళ్లను వేటగాళ్లు అంటారు.. మరి వేటగాళ్లనే వేటాడితే ఏమంటారు..? బంగాల్ బెబ్బులి మమతా బెనర్జీ అంటారు. అవును ప్రస్తుతం దేశంలో మోదీని ఎదుర్కొనే సత్తా ఉన్న నేత దీదీ మాత్రమే అని విశ్లేషకులతో పాటు విపక్షాలు కూడా చెబుతున్న మాట. ఇది రీసెంట్ గా జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైంది.


అయినా వేట‌గాళ్ల‌ను వేటాడంలో ఉన్న కిక్కే వేరు. బంగాల్‌లో హ్యాట్రిక్ విజ‌యం సాధించిన మ‌మ‌తాబెన‌ర్జీ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి టార్గెట్ 2024 అంటూ సంకేతాలు ఇస్తున్నారు. బంగాల్ లో ఓటర్లు ఇచ్చిన జోష్ తో దిల్లీ కోటలను బద్దలు కొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అసలు దీదీ ప్లాన్ ఏంటి?


ప్రస్తుతం దేశంలో భాజపాను ఎదుర్కొని ముఖ్యంగా మోదీ-షా ద్వయాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి ఏ పార్టీకి లేదన్నది విశ్లేషకుల మాట. అయితే కాంగ్రెస్ కు ఆ శక్తి ఉన్నా ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే సమయంలో దీదీపై దేశవ్యాప్త ప్రజాదరణ ఉందని, మోదీని ఎదుర్కొనే సత్తా ఆమెకే ఉందని దాదాపు అన్ని విపక్ష పార్టీలు అంగీకరిస్తున్నాయి. తాజాగా జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చూపిన తెగువే ఇందుకు సాక్ష్యం.


ఇదే ప్లాన్..


పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిసారి కాంగ్రెస్ X భాజపా గా నడిచే ఎన్నికల సంగ్రామాన్ని ఈ సారి భాజపా X థర్డ్ ఫ్రంట్ గా మార్చాలని దీదీ భావిస్తున్నారు. ఇటీవల చెలరేగిన పెగాసస్ వివాదంపై దీదీ స్పందించిన తీరు ఈ మేరకు సంకేతాలిచ్చింది. భాజపాను నిలువరించేందుకు కలిసి వచ్చే అన్ని పార్టీలతోనూ తాను మాట్లాడతానని.. ఒక వేదికను సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నట్లు దీదీ తెలిపారు. ఏదైనా పట్టుకుంటే అయ్యేవరకు నిద్రపోని నేత దీదీ. మరి ఆమె అనుకున్నట్లే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా? అయితే 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా దీదీ నాయకత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే భాజపాకు కష్టాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక అప్పుడు ఎన్నికలు మోదీ X దీదీగా మారే అవకాశం ఉందని అంటున్నారు.


మోదీ X దీదీ..


బంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం దీదీ పేరు మార్మోగిపోతోంది. దాని కారణం ఆమె ప్ర‌త్య‌ర్థులు అత్యంత శ‌క్తిమంతులు కావ‌డ‌మే. దేశంలో త‌మ క‌త్తికి అడ్డే లేద‌ని విజ‌య‌యాత్ర సాగిస్తున్న మోడీ-అమిత్‌షా ద్వ‌యానికి బంగాల్ ఫైర్ బ్రాండ్ మ‌మ‌తాబెన‌ర్జీ తానున్నాన‌ని నిలువరించారు. ఇద్దరినీ మళ్లీ హస్తినకు పంపారు. అందుకే మ‌మ‌తా బెన‌ర్జీ పేరు క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కూ వినిపిస్తోంది.


ఆ విజయం ప్రత్యేకం..


బంగాల్‌లో మ‌మ‌తాబెన‌ర్జీ సాధించిన విజ‌యం ఎంతో ప్ర‌త్యేకం. భ‌విష్య‌త్ ఆశాకిర‌ణంగా మ‌మ‌తా బెన‌ర్జీ తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. అస‌లు మోదీ -అమిత్‌షా ద్వ‌యానికి అడ్డే లేదా అనే ప‌రిస్థితుల్లో మ‌మ‌త రూపంలో ఓ ప్ర‌త్యామ్నాయం తెర‌పైకి వ‌చ్చింది. మోదీ- షా ద్వ‌యం ఓట‌మికి అతీతం కాద‌ని మ‌మ‌త నిరూపించారు. 


మ‌మ‌త‌ను ఓడించ‌డానికి మోదీ -అమిత్‌షా ద్వ‌యం ప్ర‌యోగించ‌ని అస్త్రాలు లేవు. కానీ ఆ మ‌హిళా శ‌క్తి ఎదుట వాళ్లిద్ద‌రి పాచికలు పారలేదు. 200కు పైగా సీట్లు సాధించి బంగాల్ ప‌వ‌ర్ ఏంటో వ‌రుస విజ‌యాలు న‌మోదు చేసుకుంటున్న బీజేపీకి రుచి చూపించారామె. మరి 2024 ఎన్నికల్లో దీదీ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.