Finance Ministry On Mallya Loans: క్రెడిట్ కార్డు అప్పు తీర్చకపోతే అసలుకన్నా వడ్డీ ఎక్కువ అవుతుంది. దాంతో పాటు ఇతర చార్జీలు వసూలు చేస్తారు. అప్పుడు ఆ క్రెడిట్ కార్డు తీసుకున్నవారు దివాలా తీయడం తప్పమరో మార్గం ఉండదు. అసలు కట్టేసినా అంత కంటే ఎక్కువ అప్పు ఉంటుంది. ఇప్పుడు విజయ్ మాల్యా పరిస్థితి ఇదే.
విజయ్ మాల్యా ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్యూలో తాను డబ్బులు మొత్తం చెల్లించానని.. తీసుకున్న అప్పు కంటే రెట్టింపు చెల్లించానని చెప్పారు. గతంలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ అదే చెప్పారు. దాంతో ఆయన చేసిన తప్పేమిటన్న ప్రస్నలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిత్వశాఖ ఓ వివరణ ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ప్రకారం.. ఏప్రిల్ 10, 2025 నాటికి మొత్తం విజయ్ మాల్యా బకాయిలు రూ. 17,781 కోట్లు, ఇందులో కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ , ఇతర చట్టబద్ధ బకాయిలు కూడా ఉన్నాయి. జూన్ 2013లో DRTలో కేసు దాఖలైనప్పుడు, ఎయిర్‌లైన్స్ నాన్-పెర్ఫార్మింగ్ బకాయిలు రూ. 6,848 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో గ్రూప్ కంపెనీల రీడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు కూడా ఉన్నాయి. ఇవి రుణాలకు బదులుగా బ్యాంకుల వద్ద తాకట్టుగా పెట్టారు. వడ్డీ మరియు ఇతర ఛార్జీలు రూ. 10,933 కోట్లు ఆ బకాయిలకు కలిపారు. ఏప్రిల్ 10, 2025 నాటికి మొత్తం బాధ్యత రూ. 17,781 కోట్లు విజయ్ మాల్యా బాకీ ఉన్నారు. విజయ్ మాల్యా నుంచి బ్యాంకులు రూ. 10,815 కోట్లు వసూలు చేశాయి. అంటే ఇంకా ఇంకా రూ. 6,967 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
తాను రూ. 6,848 కోట్ల రుణాలకు బదులుగా రూ. 14,000 కోట్లు చెల్లించానని మల్యా చెబుతున్నారు. ఏదైనా రుణం మొత్తం చెల్లించే వరకు పెనాల్టీ వడ్డీ కూడా ఉంటుందని.. కానీ మల్యా తన వాదనలో అసలు మొత్తాన్ని మాత్రమే పరిగణించి చెబుతున్నారని భావిస్తున్నారు. బ్యాంకులకు ఇప్పటికీ మల్యా రూ. 6,967 కోట్లు బాకీ ఉన్నాడని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్లయింది.
విజయ్ మాల్యా తన వాదన వినిపించేందుకు ఇచ్చిన పాడ్ కాస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను తాను నీతిగా చిత్రీకరించుకునేందుకు ప్రయత్నించారని అంటున్నారు.