Odisha India One Air charter plane crashed: ఒడిశా లో శనివారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ చార్టర్ విమానం కూలిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఇండియా వన్ ఎయిర్ సంస్థకు చెందిన తొమ్మిది సీట్ల చిన్న విమానం సాంకేతిక కారణాలతో అడవి ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఒక పైలట్‌తో పాటు ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం రూర్కెలా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. రూర్కెలాకు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్జన ప్రాంతంలో విమానం కిందకు పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీమ్స్ , స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. అటవీ ప్రాంతం కావడంతో ఘటనా స్థలానికి చేరుకోవడానికి అధికారులు కొంత శ్రమించాల్సి వచ్చింది.
ప్రమాద స్థలం నుంచి రక్షించిన ప్రయాణికులను, పైలట్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిలో ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంజిన్ వైఫల్యమా లేదా వాతావరణ పరిస్థితులా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఘటనా స్థలాన్ని పరిశీలించింది.
ఈ ఘటనపై విమానయాన నియంత్రణ సంస్థ విచారణకు ఆదేశించింది. విమానం బ్లాక్ బాక్స్‌ను సేకరించి, ప్రమాదానికి గల సాంకేతిక కారణాలను విశ్లేషించనున్నారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక కోరింది. ప్రయాణికులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది.