Maharashtra Opposition Seat Sharing: లోక్‌సభ ఎన్నికల ముందు ఒక్కో రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. NDAని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన I.N.D.I.A కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చాయి. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు మిగతా పార్టీలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ...ఆ తరవాత మళ్లీ ఒక్కో పార్టీ దగ్గరవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆప్‌తో డీల్ కుదిరింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఉద్దవ్ థాక్రే శివసేన పార్టీతో సీట్ల లెక్కలు కొలిక్కి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శివసేన (UBT) 21 చోట్ల పోటీ చేయనుందని తెలుస్తోంది. అటు కాంగ్రెస్ 15 స్థానాల్లో, శరద్ పవార్ NCP 9 చోట్ల పోటీ చేసే అవకాశాలున్నాయి. Vanchit Bahujan Aaghadi (VBA) పార్టీ కూడా ఇటీవలే మహా వికాస్ అఘాడిలో (MVA) చేరింది. ఈ పార్టీ కూడా రెండు చోట్ల పోటీ చేసే అవకాశముంది. శరద్ పవార్ ఇంట్లో ఈ మేరకు కీలక భేటీ జరిగిందని సమాచారం. కాంగ్రెస్ నేతలు నానా పటోలే, పృథ్విరాజ్ చవాన్, వర్ష గైక్వాడ్ సహా మరి కొంత మంది కీలక వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొన్నారని తెలుస్తోంది. అయితే...దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. కూటమిలోని సీనియర్ నేతలు ప్రకటించనున్నారు.
దేశంలో అత్యధిక లోక్‌సభ నియోజకవర్గాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ 80 స్థానాలున్నాయి. ఆ తరవాత అత్యధికంగా మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటికే సంజయ్ రౌత్ ఈ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు కొనసాగుతున్నాయని, అంతా కలిసి అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలవాలన్నదే తమ లక్ష్యం అని, సీట్‌లు ఎన్ని వచ్చినా పరవాలేదని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నదే తమ ఎజెండా అని తేల్చి చెప్పారు. అటు కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. మార్చి 4వ తేదీన ఢిల్లీ వేదికగా సమావేశం కానుంది. ఆ భేటీలోనే అభ్యర్థుల జాబితాని ఫైనలైజ్ చేయనుంది.
కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు లెక్కలు కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. విశ్వసీయ వర్గాల సమాచారం ప్రకారం...ఢిల్లీలో ఆప్ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేస్తాయని ఇప్పటికే తెలిసింది. అయితే...దీనిపై అధికారిక ప్రకటన చేసేందుకు రెండు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మైత్రిని కేవలం ఢిల్లీకే పరిమితం చేయకుండా మరికొన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగించాలని చూస్తున్నాయి. ఆప్‌తో డీల్ కుదిరిందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మరి తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితేంటన్న ప్రశ్న తెరపైకి వస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని, ఆ పార్టీ తమతో కలిసి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. I.N.D.I.A కూటమిని బలోపేతం చేయాలనుకున్న వారిలో మమతా బెనర్జీ కూడా ఒకరని, పొత్తుల విషయంలో చర్చలకు సిద్ధంగానే ఉన్నాని వెల్లడించారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల ముందు కర్ణాటకలో కులగణన, కాంగ్రెస్‌పై లింగాయత్‌ల అసహనం