SK Devaraya University: అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉపకులపతి నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విశ్వవిద్యాలయ అభివృద్ధికి, చదువుల నాణ్యత పెంచడానికి, విద్యార్థులకు ఇబ్బంది లేని చదువు అందించడానికి, ఇతర సమస్యలపై దృష్టి పెట్టిన తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే అందరూ మెచ్చుకునేవారు. కానీ వీసీ అయి ఉండి ఓ వింత నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు  అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


వారు 500, వీరు 100 రూపాయలివ్వాలి


ఎస్కే యూనివర్సిటీలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం చేయాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా హోమం చేయడానికి అయ్యే ఖర్చును చందాల రూపంలో ఇవ్వాలని ఉద్యోగులకు రిజిస్ట్రార్ లక్ష్మయ్యతో ఏకంగా సర్క్యులర్ జారీ చేయించారు. టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 500 రూపాయలు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇవ్వాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీలైతే అంతకంటే ఎక్కువే ఇవ్వొచ్చని సర్క్యులర్ లో కోరారు. యూనివర్సిటీ స్టాఫ్ నుంచి చందాలు వసూలు చేసేందుకు ఏకంగా ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ నే నియమించడం గమనార్హం.


వరుస మరణాలు, అందుకే హోమం


ఎస్కే యూనివర్సిటీ వీసీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయంలో ఇటీవలి కాలంలో వరుస మరణాలు సంభవించాయి. కొంత కాలంలో వివిధ కారణాల వల్ల దాదాపు 25 మంది యూనివర్సిటీ సిబ్బంది మృతి చెందారు. దీంతో ఈ విషయంలో వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయ ఉద్యోగులు వివిధ కారణాల చనిపోతుండటం వల్ల వర్సిటీలో ధన్వంతరి మహా మృత్యుంజయ హోమం చేయాలని ఉపకులపతి నిర్ణయం తీసుకున్నారు. మృత్యుంజయ హోమంతో పాటు శాంతి హోమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రార్ సర్య్కులర్ జారీ చేయడం, ఉద్యోగుల నుండి చందాలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.


విద్యార్థి సంఘాల ఆగ్రహం


మృత్యుంజయ హోమం చేయాలని వీసీ తీసుకున్న నిర్ణయాన్ని, అందుకోసం చందాలు అడగడాన్ని విద్యార్థి  సంఘాలు తప్పుపడుతున్నాయి. ఇలాంటి హోమం లాంటి కార్యక్రమాల వల్ల వర్సిటీలో కులాలు, మతాల మధ్య వైషమ్యాలు పొడచూపే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వ విద్యాలయంలో మత కార్యక్రమం నిర్వహించడం సబబు కాదని, ఈ నిర్ణయాన్ని ఉపకులపతి, రిజిస్ట్రార్ వెనక్కి తగ్గాలని అన్నారు. వర్సిటీలో కులాలు, మతాలుగా విడదీసే విధంగా హోమాలు చేయడం ఏమాత్రం కరెక్టు కాదని చెప్పారు. హోమాలు, యాగాలు, శాంతి పూజలు చేయడానికి బదులు వర్సిటీ అభివృద్ధిపై దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఎస్కే యూనివర్సిటీలో తలపెట్టి దల్చిన మహా మృత్యుంజయ హోమం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని.. లేదంటే మత కార్యాన్ని అడ్డుకుంటామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.


బలవంతం లేదు, ఇష్టముంటేనే


ఈ అంశంపై రిజిస్ట్రార్ లక్ష్యయ్య మాట్లాడారు. ఇటీవల వర్సిటీలో చాలా మంది బోధన, బోధనేతర సిబ్బంది అకాల మరణం చెందిన నేపథ్యంలో మృత్యుంజయ హోమం నిర్వాహించాలని అనుకున్నట్లు తెలిపారు. తమ పేరిట పూజ చేయించుకోవాలని అనుకునే వారు మాత్రమే చందాలు ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ ఇవ్వాలని బలవంతమేమీ చేయడం లేదని రిజిస్ట్రార్ తెలిపారు.