విలాసవంతమైన క్రూయీజ్‌ నౌకలో పర్యటనకు వెళ్లిన సుమారు 206 మంది ప్రయాణికులు అనుకోకుండా ఎక్కడో మారుమూల ప్రాంతంలో  చిక్కుకుపోయారు. ఈ ఘటన గ్రీన్‌ల్యాండ్‌ దేశంలో జరిగింది. గ్రీన్‌ల్యాండ్‌కు చాలా దూరంలో మారమూల ప్రాంతంలో క్రూయీజ్‌ షిప్‌ ఆగిపోయినట్లు మీడియా కథనాల్లో వెల్లడించారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని క్రూయీజ్‌ ఆపరేటర్‌ సంస్థ వెల్లడించింది. అయితే మరొక నౌకను ఇప్పుడు క్రూయీజ్‌ ఆగిపోయిన ప్రాంతానికి తీసుకురావడానికి శుక్రవారం దాకా సమయం పడుతుందని, అప్పటి దాకా ప్రయాణికులు నౌకలోనే ఉంటారని షిప్‌ ఆపరేటర్‌ ఆరోరా ఎక్స్‌పిడిషన్స్‌ సంస్థ తెలిపింది. 


ఓషియన్‌ ఎక్స్‌ప్లోరర్‌ అనే క్రూయీజ్‌ పర్యాటకులతో సెప్టెంబరు 1న బయలుదేరి వెళ్లింది. తిరిగి పర్యటన ముగించుకుని సెప్టెంబరు 22న ఒడ్డుకు చేరాల్సి ఉంటుంది. అయితే ఉన్నట్టుండి గ్రీన్‌ల్యాండ్‌ ఈశాన్య ప్రాంతంలోని ఆల్పెఫ్‌జోర్డ్‌ అనే మారుమూల ప్రాంతంలో ఆగిపోయింది. ఈ ప్రాంతం గ్రీన్‌ల్యాండ్ రాజధాని నౌక్‌కు సుమారు 850మైళ్ల దూరంలో ఉంటుంది. షిప్‌ సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో నిలిచిపోయింది. దాన్ని వెంటనే రిపేర్‌ చేసి నడిపించడం కష్టం అని భావించిన సిబ్బంది మరో రెస్క్యూ షిప్‌ను తెప్పిస్తున్నారు. నౌక చాలా దూరంలో నిలిచపోవడం వల్ల అక్కడికి మరో నౌక వెళ్లడానికి చాలా సమయం పడుతోంది. ఈ మూడు వారాల ట్రిప్‌ కోసం క్రూయీజ్‌ సంస్థ ప్రయాణికులు ఒక్కొక్కరి నుంచి 33,000 డాలర్లు వసూలు చేసింది.


క్రూయీజ్‌లో ఉన్న ప్రయాణికులు ఇప్పుడు వెంటనే ప్రమాదమేమీ లేదని, వాతావరణం కూడా బాగానే ఉందని, నౌకలో వారికి కావాల్సిన అన్ని వస్తువులు, సరుకులు అందుబాటులో ఉన్నాయని షిప్‌ ఆపరేటర్‌ సంస్థ వెల్లడించింది. కాకపోతే వెంటనే సహాయం అందే పరిస్థితి లేదని, ఇక్కడికి తమ యూనిట్లు అన్నీ దూరంగా ఉన్నాయని, వాతావరణం కూడా ప్రతికూలంగా ఉందని పేర్కొంది. ప్రయాణికులకు తక్షణ ప్రమాదమేమీ లేదని, తాము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్తోంది. నౌక నిలిచిపోవడంతో సిబ్బంది ఆర్కిటిక్‌ కమాండ్‌కు సందేశం ఇచ్చారు. అయితే సహాయం అందడానికి సమయం మాత్రం పడుతుంది. ఈ ఘటనను చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని డానిష్‌ మిలిటరీ జాయింట్‌ ఆర్కిటక్‌ కమాండ్‌కు చెందిన బ్రియాన్‌ జెన్‌సేన్‌ తెలిపారు.


అయితే నౌకలో ఉన్నవాళ్లలో ఎక్కువ మంది వయసు ఎక్కువగా ఉన్నవారు ఉన్నారని, వారిలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కూడా ఉన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్లు తెలిపింది. నౌకలో తన భార్యతో ప్రయాణిస్తున్న స్టీవెన్‌ ఫ్రేజర్‌ అనే ఆస్ట్రేలియన్‌ వ్యక్తి మాట్లాడుతూ.. 'నౌకలో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే నౌక మారమూల ప్రాంతంలో నిలిచిపోవడం కొంచెం నిరాశపరించింది. కానీ మేము ప్రపంచంలో అందమైన ప్రదేశంలో ఉన్నాం. కిటికిలో నుంచి చూస్తే అందమైన మంచు పర్వతాలు కనిపిస్తున్నాయి. నౌకలో ఒకటి లేదా రెండు కొవిడ్‌ కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక డాక్టర్‌ అందుబాటులో ఉన్నారు. నౌకలో ఉన్న చాలా మంది వయసు మళ్లినవారు' అని తెలిపారు.


ఓషియన్‌ ఎక్స్‌ప్లోరర్‌ను 2021లో నిర్మించారు. 134 మంది ప్రయాణికులకు వసతులు కల్పించగలిగే ఇన్ఫినిటీ క్లాస్‌ నౌక ఇది. ప్రపంచంలో అత్యంత మారుమూల ప్రాంతాలను ఎక్స్‌ప్లోర్‌ చేయడం కోసం దీన్ని నిర్మించినట్లు సంస్థ వెల్లడించింది.