Lokesh responded to the AP Vijaya Dairy issue: ఆంధ్రప్రదేశ్ డెయిరీ ఫెడరేషన్,  విజయ' డెయిరీ బ్రాండ్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో జరుగుతున్న నెయ్యి విక్రయాల్లో కల్తీ జరుగుతోందంటూ తెలంగాణ తెలంగాణ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌ గుత్తా అమిత్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై   నారా లోకేష్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Continues below advertisement

గుత్తా అమిత్ రెడ్డి లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాలు: 

గుత్తా అమిత్ రెడ్డి  విజయ బ్రాండ్ నెయ్యి నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఒక ప్రైవేట్ సంస్థ మేఘనా ఫుడ్స్ ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లోని ఒక డెయిరీ నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని పేర్కొన్నారు. NDDBకి చెందిన CALF ల్యాబ్‌లో జరిపిన పరీక్షల్లో ఈ నెయ్యిలో వనస్పతి ఫ్యాట్ ఆనవాళ్లు (β-sitosterol) ఉన్నట్లు తేలిందని, ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు అని ఆరోపించారు. అంతేకాకుండా, స్థానిక రైతులకు ఎటువంటి సంబంధం లేని ఈ ప్రైవేట్ ఫ్రాంచైజీ నమూనా వల్ల రైతులకు ఒరిగేదేమీ లేదని, కేవలం బ్రాండ్ పేరును అమ్ముకుంటున్నారని ఆయన విమర్శించారు.

Continues below advertisement

నారా లోకేష్   స్పందన - విచారణకు ఆదేశం 

ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ, అమిత్ రెడ్డి వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ఇప్పటికే ఎప్పటికప్పుడు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తోందని, అయినప్పటికీ ఈ ఫిర్యాదు  కారణంగా మార్కెట్ నుంచి ర్యాండమ్ శాంపిల్స్ సేకరించి పరీక్షించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. తెలంగాణ డెయిరీ ఫెడరేషన్ వద్ద ఉన్న ల్యాబ్ రిపోర్టులను కూడా సేకరించి, వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు.

వన్ నేషన్ - వన్ మార్కెట్' దృక్పథం 

జిల్లా యూనియన్లు ,  రాష్ట్ర ఫెడరేషన్లు తమ సరిహద్దులు దాటి మార్కెటింగ్ చేయడంపై అమిత్ రెడ్డి చేసిన అభ్యంతరాన్ని లోకేష్ సున్నితంగా తిరస్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత అయిన  వన్ నేషన్ - వన్ మార్కెట్ సూత్రం ప్రకారం ఏ రాష్ట్ర ఉత్పత్తులైనా ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఆయన గుర్తు చేశారు. అయితే, వ్యాపారం ఎక్కడ చేసినా వినియోగదారుల ఆరోగ్యం  , ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడదని ఆయన స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.