Lok Sabha Polls 2024: పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతే రాహుల్ గాంధీ రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన చేయాలని సెటైర్లు వేశారు. ఏదో నడపాలంటే నడపాలన్నట్టుగా పార్టీని నడిపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. అటు తప్పుకోడానికి వీల్లేక, అటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్‌ని లీడ్ చేయడం ఇష్టం లేక అవస్థలు పడుతున్నారని తేల్చి చెప్పారు. పదేళ్ల పాటు కాంగ్రెస్‌కి అధ్యక్షుడిగా పని చేసి కూడా ఏమీ చేయలేకపోయారని మండి పడ్డారు. నిజానికి ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌కి ఎన్నికల వ్యూహకర్తగా ఉండాల్సింది. కానీ కొన్ని భేదాభిప్రాయాల వల్ల ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు పీకే.
"పదేళ్లుగా ఎలాంటి సక్సెస్ లేకుండా చేసిన పనే చేయడం వల్ల ఎవరికి ఉపయోగం..? కొద్ది రోజుల పాటు విరామం తీసుకోవడం మంచిది. వేరే వ్యక్తికి ఆ అవకాశం ఇవ్వాలి. అలాంటి సమయంలోనే మీరు (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) తల్లి సోనియా గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఆ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది"
- ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
రాజీవ్ గాంధీ హత్య తరవాత సోనియా గాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా పార్టీని నడిపే సరైన వ్యక్తి లేకపోవడం వల్ల ఆమె కొనసాగాల్సి వచ్చిందని గుర్తు చేశారు పీకే. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా చేసే వ్యక్తులనే ఎక్కువగా నమ్ముతున్నారని, అది సరైన పద్ధతి కాదని వెల్లడించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత అసలు పార్టీ వ్యవహారాలే చూడనని చెప్పిన రాహుల్...ఇప్పుడు పూర్తి స్థాయిలో పార్టీని మోయాల్సి వస్తోందని అన్నారు. చాలా మంది నేతలు ఇప్పటికీ సొంతగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. మిగతా పార్టీలతో ఎన్ని సీట్‌లు పంచుకోవాలన్న అభిప్రాయాల్నీ స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతున్నారని స్పష్టం చేశారు.