Liquor shops one plus one offer: వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఉండే డిమాండ్ వేరు. అందుకే చాలా కంపెనీలు సబ్బుల దగ్గర నుంచి చాలా ఖరీదైన వస్తువుల వరకూ వన్ ప్లస్ వన్ ఆఫర్లు పెడుతూ ఉంటాయి.  ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఇలాంటి ఆఫర్ల వరద ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా కంపెనీల నుంచి ఇలాంటి ఆఫర్లు వస్తాయి కానీ.. లిక్కర్ షాపుల నుంచి మాత్రం అంత తేలికగా రావు. అలా వస్తే మందు బాబులకు ఉండే కిక్కు వేరు. ఈ అదృష్టం ఈ సారి ఉత్తరప్రదేశ్ మందుబాబులకు పట్టింది. 

యూపీలో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త లిక్కర్ పాలసీ తీసుకు వస్తున్నారు.  కొత్త ఎక్సైజ్ పాలసీ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రావడంతో స్టాక్ క్లియరెన్స్ కోసం లిక్కర్ షాపులన్నీ ఆఫర్స్ ఇస్తున్నాయి. యీపీ కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం  లిక్కర్ లైసెన్సులు ఇ-లాటరీ విధానం ద్వారా కేటాయించబోతున్నారు.  దీని వల్ల ఇప్పటికే దుకాణాలు ఉన్న వారు తమ పాత స్టాక్‌ను మార్చి 31, 2025 లోపు క్లియర్ చేయాల్సి ఉంది. నష్టాలను తగ్గించుకోవడానికి  వారు "వన్ ప్లస్ వన్" వంటి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఇస్తున్నారు. 

ఈ డిస్కౌంట్ల కారణంగా లిక్కర్ షాపుల వద్ద జనం  ఉంటున్నారు. కొన్ని  కొన్ని చోట్ల మందుబాబుల్ని నియంత్రించడానికి పోలీసులను కూడా నియమించారు. ఈ ఆఫర్స్ మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో అమ్మకాలు 30-40% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.