Sidhu Moosewala Parents New Born Baby: రెండేళ్ల క్రితం హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు పండంటి మగ  బిడ్డకి జన్మనిచ్చారు. సిద్దూ తండ్రి బల్కౌర్ సింగ్ (60) ఇన్‌స్టాగ్రామ్‌లో కొడుకు ఫొటోని షేర్ చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. సిద్దూ మూసే వాలా ఫొటో పక్కనే కొడుకుని ఎత్తుకుని కూర్చున్న ఫొటోని పోస్ట్ చేశారు. అందరి ప్రేమాభిమానాలు, వాహే గురు ఆశీర్వాదాల వల్ల సిద్దూ మూసేవాలాకి తమ్ముడు పుట్టాడని, ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు. తమరై ఇంత ప్రేమ చూపిస్తున్న సన్నిహితులందరికీ ధన్యావాదాలు తెలిపారు. సిద్దూ తల్లిదండ్రులైన బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ IVF ద్వారా ఈ బిడ్డకి జన్మనిచ్చారు.

 

సింగర్‌గానే కాకుండా రాజకీయ నేతగానూ సిద్దూ మూసేవాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2022లో మే 29న పంజాబ్‌లోని మన్సా జిల్లాలో ఓ షో వెళ్లి వస్తుండగా కొందరు దుండగులు వచ్చి అతడిని కాల్చి చంపారు. ఈ దాడి జరిగినప్పుడు తనతో పాటు జీప్‌లో ఫ్రెండ్స్‌ కూడా ఉన్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న సిద్దూని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. కెనడాకి చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఈ హత్య తానే చేయించినట్టు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టడం సంచలనమైంది.