Arunachal Pradesh Landslides: అరుణాచల్ ప్రదేశ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనతో చైనా సరిహద్దుని కలిపే హైవే (NH 313 ) చాలా వరకూ ధ్వంసమైంది. చైనాలోని Dibang Valley కి వెళ్లే ఆ దారి (China Border Road) పూర్తిగా తెగిపోయింది. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురవడం వల్ల రహదారి ధ్వంసమైపోయింది. ఫలితంగా రాకపోకలూ నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ఆ రహదారిని మరమ్మతు చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. అందుకోసం అవసరమైన సామగ్రిని ఇప్పటికే పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా సాయం అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాలతో పాటు ఇతరత్రా నిత్యావసరాలను పంపుతున్నారు. భారత్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతానికి వెళ్లేందుకు ఇదొక్కటే దారి. ఇప్పుడీ రహదారి ధ్వంసమవడం వల్లఆందోళన నెలకొంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌ ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు ఈ దారిలో ఎవరూ వెళ్లకూడదని తేల్చి చెప్పింది. మరమ్మతులు పూర్తి కావడానికి కాస్త సమయం పడుతుందని, వర్షాలు కురుస్తున్నందున ఆలస్యం అయ్యే అవకాశముందని వెల్లడించింది. 


"దిబాంగ్ వ్యాలీలోని ప్రజలందరికీ ఇదే విజ్ఞప్తి. భారీ వర్షాల కారణంగా NH 313 రహదారి ధ్వంసమైంది. ప్రస్తుతానికి మరమ్మతులు కొనసాగుతున్నాయి. కానీ వర్షాల కారణంగా ఇది ఆలస్యమవచ్చు. మరో మూడు రోజుల పాటు ఎవరూ ఈ దారిలో ప్రయాణం చేయొద్దు. త్వరలోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయి. అప్పటి వరకూ మా సూచనలు పాటించాలని కోరుతున్నాం"


- అధికారులు