Lalu Yadav daughter quits politics: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి భారీ ఓటమి చవి చూసింది. ఈ ప్రభావం ఆ పార్టీలపై ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు పూర్తిగా వీడ్కోలు పలికి, తన కుటుంబ సభ్యులతో సంబంధాలు కట్ చేస్తున్నట్టు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె సోదరుడు తేజస్వి యాదవ్ సన్నిహితుడు సంజయ్ యాదవ్, రమీజ్‌లపై కూడా ఆరోపణలు చేసింది. ఈ రాజీనామా ఆర్జేడీలో మరో సంక్షోభాన్ని సృష్టించింది, లాలూ కుటుంబంలో ఇప్పటికే ఉన్న అంతర్గత విభేదాలను మరింత ఊపందుకునేలా చేసింది. రోహిణి ఆచార్య శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ పోస్ట్‌లో ఆమె తాను ఆర్జేడీలో చేసిన కృషిని, కుటుంబానికి చేసిన సేవలను కూడా ప్రస్తావించారు. రోహిణి ఆచార్య 2022లో తండ్రి లాలూ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేశారు. తాను ఎప్పుడూ కుటుంబం కోసం పోరాడానని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ముగిసిపోయిందన్నారు. రోహిణి ఆచార్య 2024 లోక్‌సభ ఎన్నికల్లో సరాన్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేశారు. అప్పట్లో ఆమె 4.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆమె ఆర్జేడీలో చురుకుగా పాల్గొని, తేజస్వి యాదవ్ కు మద్దతుగా నిలిచారు. కుటుంబంలో అంతర్గత విభేదాలు పెరగడంతో పార్టీకి దూరమయ్యారు. పార్టీలో ఎక్కువగా సంజయ్ యాదవ్ జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. ఇవి 2025 సెప్టెంబర్ నుంచే మొదలయ్యాయి. రోహిణి తండ్రి లాలూ, సోదరుడు తేజస్వి యాదవ్‌లను ఎక్స్‌లో అన్‌ఫాలో చేసి, ప్రొఫైల్ ప్రైవేట్ చేసుకుంది. ఆమెకు తేజ్ ప్రతాప్ యాదవ్ మద్దతుగా నిలిచారు. ఆయన కూడా పార్టీకి దూరమయ్యారు. సొంత పార్టీ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు.
రోహిణి పోస్ట్‌లో ప్రస్తావించిన సంజయ్ యాదవ్ ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ, తేజస్వి యాదవ్ సన్నిహితుడు. 2025 సెప్టెంబర్‌లో బీహార్ అధికార్ యాత్ర సమయంలో సంజయ్ తేజస్వి వానిటీ వ్యాన్‌లో ఫ్రంట్ సీట్ తీసుకున్నారని రోహిణి విమర్శించింది. "ఫ్రంట్ సీట్ పార్టీ లీడర్‌కు మాత్రమే," అని పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేసింది. లాలూ కుటుంబం, ఆర్జేడీ నేతలు ఇప్పటివరకు రోహిణి ప్రకటనపై అధికారికంగా స్పందించలేదు. అయితే, రాజకీయ విశ్లేషకులు ఇది ఆర్జేడీకి మరో షాక్ అని, కుటుంబ విభేదాలు పార్టీని మరింత బలహీనపరుస్తాయని అంచనా వేస్తున్నారు. తేజ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీపడి ఓడిపోయాడు.ఈ నిర్ణయం ఆర్జేడీలో మరో సంక్షోభాన్ని సూచిస్తోంది.