Sri Krishna Janmabhoomi:


హిందూసేన పిటిషన్..


శ్రీకృష్ణ జన్మస్థాన్-షాహీ ఈద్గా వివాదం విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో సర్వే చేపట్టాలని కోర్టు ఆఫీసర్లను ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి 20లోగా దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందించాలని తేల్చి చెప్పింది. సివిల్ జడ్జ్ సోనికా వర్మ ఈ ఆదేశాలు జారీ చేశారు. హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త పిటిషన్‌ను విచారించిన కోర్టు...ఈ ఉత్తర్వులు ఇచ్చింది. షాహీ ఈద్గాను స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాన్ని కూలగొట్టాలని పిటిషన్‌లో కోరారు పిటిషనర్. శ్రీకృష్ణ జన్మస్థానమైన 13.37 ఎకరాల భూమిలో శ్రీకృష్ణ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఔరంగజేబు ఆ స్థానంలో ఈద్గాను నిర్మించారని పిటిషన్‌లో ఆరోపించారు విష్ణు గుప్త. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. అది అక్రమ ఒప్పందం అని పిటిషన్‌లో పేర్కొన్నారు. నిజానికి...షాహీ ఈద్గాను పడగొట్టాలని ఇప్పటికే కోర్టుకి ఎన్నో పిటిషన్‌లు వచ్చాయి. వాటిలో ఇదీ ఒకటి. కృష్ణ జన్మభూమి స్థానాన్ని ఆక్రమించి ఈద్గాను నిర్మించారని ఎప్పటి నుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.