Republic Day 2023: పురాణ చరిత్ర కలిగిన కోనసీమ ప్రభల తీర్థ మహోత్సవానికి సంబంధించి సాంప్రదాయ బద్ధంగా ఊరేగించే "ప్రభ" భారత గణతంత్ర దినోత్సవానికి(Republic Day ) ఒక శకటంగా(Tableau) ఎంపికైంది. భారత గణతంత్ర దినోత్సవానికి ఈసారి పల్లె సంప్రదాయాలకు, ఆచారాలకు అద్దం పట్టే ప్రభల తీర్థం శకటంగా ఎంపిక అవ్వడంపై కోనసీమ వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తం అవుతున్నాయి. అంబేద్కర్ కొనసీమలో సంక్రాంతి(Sankranthi) సందర్భంగా ప్రజలంతా వర్గ, సామాజికరహితంగా పాలు పంచుకునే ఉత్సవం ప్రభల తీర్ధం మహోత్సవం. ఈ మహోత్సవంలో భక్తుల భుజాలపై ఊరేగే ప్రభలన్ని మన ప్రకృతిని, సంప్రదాయక కళానైపుణ్యాన్ని ప్రతిబింబిస్తూ, మూర్తిత్వాన్ని సజీవకతను ఉట్టిపడేలా చేస్తాయి. ఇలాంటి తీర్థంలో పాల్గొంటే తమకు మంచి జరుగుతుందని భారీగా ప్రజలు పాల్గొంటారు. ఈ ఏడాది రిపబ్లిక్ ఉత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరిగే శకటాల ప్రదర్శనకు ప్రభ తీర్థం ఎంపిక అవ్వడం కోనసీమ ప్రభల తీర్థ మహోత్సవ గొప్పతనం గురించి దేశం మెత్తం వ్యాప్తి అవుతుందని కోనసీమ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రదర్శన కోసం మొత్తం 17 శకటాలు ఎంపిక..
మొత్తం 17 శకటాలు గణతంత్ర ఉత్సవ కార్నివాల్ కు ఎంపికైతే అందులో ప్రభల తీర్థం ఉండటం విశేషం. సంక్రాంతి ఉత్సవాల ఇతి వృత్తంగా, సహస్ర వృత్తుల సంఘటిత జీవనానికి ఈ శకటం ఆనవాలు.. దగ్గర చూస్తే ప్రభ పారవశ్యానికి లోను చేస్తోంది. గణతంత్ర ఉత్సవాల్లో ప్రభల తీర్థం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒక్క కోనసీమలోనే కాక మొత్తం ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రభల తీర్థాలను తీసుకుని వెళ్లడం ఆనవాయితీ.
జగ్గన్న తోట ప్రభల తీర్థం గురించి ఇదీ చరిత్ర...
ఏకాదశ రుద్రుల కొలువు లోక కళ్యాణం కోసం ప్రతీ ఏటా కనుమ రోజున ఏకాదశ రుద్రులు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని ప్రతీతి. ఇందు కోసమే ఏకాదశ రుద్రులు ప్రతి రూపాలుగా మార్చి ప్రభలను భక్తులు తమ భుజ స్కందాలపై మోసుకుంటూ జగ్గన్న తోటకు చేర్చుతారు. సుమారు 400 సంవత్సరాల క్రితం 17వ శతాబ్దంలో కనుమ రోజున ఏకాదశ రుద్రులు లోక కళ్యాణార్ధం జగ్గన్నతోటలో సమావేశమై లోక పరిస్థితుల గురించి చర్చించారనీ, అప్పటి నుంచి కనుమ రోజున జగ్గన్నతోటలో ప్రభల తీర్ధం నిర్వహించబడుతున్నదని పురాణ చరిత్ర. ఈ నేపథ్యంలోనే కొన్ని శతాబ్దాలుగా ఈ తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రధాని ప్రశంసలు పొందిన ప్రభ...
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో కనుమ సందర్భంగా జరిగే ప్రభల తీర్థం భారతీయ సంస్కృతికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక లేఖ ద్వారా సందేశాన్ని పంపారు. ఈ ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అంబాజీపేట అగ్రహారం శివకేశవయూత్ ప్రభల తీర్థం విశిష్టతపై ప్రధానమంత్రి లేఖ రాశారు. జగ్గన్నతోట ప్రభల తీర్థం 17వ శతాబ్దం నుంచి జరగడం ఎంతో అరుదైన విషయమని, ఈ తీర్థానికి దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు రావడం ఎంతో సంతోషమని పేర్కొన్నారు. గ్రామాల్లో నేటికీ సంస్కృతీ సంప్రదాయాలు కొనసాగుతుండడాన్ని లేఖలో కొనియాడారు.